ఆ 40వేల మంది ఎక్క‌డ ? పొంచి ఉన్న క‌రోనా ముప్పు ?

-

కరోనా లాక్‌డౌన్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా అనేక ల‌క్ష‌లాది మంది వ‌ల‌స కార్మికులు తాము ప‌నిచేసే ప్రాంతాల నుంచి సొంత ఊళ్ల‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఎన్నో వేల మంది త‌మ త‌మ గ్రామాల‌కు చేరుకున్నారు. అయితే ఛ‌త్తీస్‌గ‌డ్‌లో మాత్రం సుమారుగా 40వేల మంది వ‌ల‌స కార్మికుల ఆచూకీ తెలియ‌డం లేదు. వారు ఇత‌ర రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రానికి వ‌చ్చారు. కానీ స‌రైన నిఘా లేక‌పోవ‌డం వ‌ల్ల వారి ఆచూకీ క‌నుగొన‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. దీంతో ఆ రాష్ట్రానికి క‌రోనా ముప్పు పొంచి ఉంద‌ని వైద్యాధికారులు అంటున్నారు.

chattisgarh yet to identify 40000 migrant workers who returned to state

దేశంలోని ప‌లు ఇత‌ర రాష్ట్రాల నుంచి మొత్తం 60వేల మంది కార్మికులు చ‌త్తీస్‌గ‌డ్‌కు చేరుకున్నారు. అయితే వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు 20వేల మంది ఆచూకీని క‌నుగొన్నారు. ఇంకా 40వేల మంది కార్మికుల జాడ తెలియాల్సి ఉంది. అయితే వారు ఇప్ప‌టికే రాష్ట్రంలో ఉన్న నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ ముప్పు పొంచి ఉంద‌ని అక్క‌డి వైద్యాధికారులు అంటున్నారు. చాలా మంది బ‌య‌ట‌కు రాకుండా, త‌మ వివ‌రాలు తెల‌ప‌కుండా ఇండ్ల‌లోనే ఉంటున్నార‌ని, కొంద‌రు వేరే చోట్ల దాక్కున్నార‌ని అధికారులు తెలిపారు. దీంతో వారి జాడ క‌నిపెట్ట‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంద‌ని అంటున్నారు. అయితే వారిలో ఎవ‌రికి క‌రోనా ఉన్నా సమూహ వ్యాప్తి క‌చ్చితంగా మొద‌ల‌వుతుంద‌ని అంటున్నారు.

అయితే ఛ‌త్తీస్‌గ‌డ్‌లో మిగిలిన ఆ 40వేల మంది వ‌ల‌స కార్మికుల ఆచూకీని ఈ నెల చివ‌రి వ‌ర‌కు క‌నుక్కుంటామ‌ని అధికారులు తెలిపారు. చాలా మంది వ‌ల‌స కార్మికులు కాలి న‌డ‌క‌న, ర‌హ‌దారి మార్గంలో కాకుండా షార్ట్‌క‌ట్‌ల‌లో త‌మ త‌మ గ్రామాల‌కు చేరుకున్నార‌ని, అందువ‌ల్లే ఎవ‌రెవ‌రు రాష్ట్రంలోకి వ‌చ్చారో స‌రిగ్గా వివ‌రాలు తెలియ‌డం లేద‌ని అధికారులు అంటున్నారు. అయితే దేశ‌వ్యాప్తంగా త‌మ సొంత రాష్ట్రాల‌కు వ‌ల‌స కార్మికులు ఇలా అనేక మంది తిరిగి వెళ్లిన నేప‌థ్యంలో రాష్ట్రాలు వారంద‌రి స‌మాచారాన్ని సేక‌రించాయా ? వారిపై నిఘా ఉంచాయా ? చ‌త్తీస్‌గ‌డ్‌లాగే ఇంకా ఏ రాష్ట్రంలో అయినా కార్మికుల వివ‌రాలు తెలుసుకోవాల్సి ఉందా ? అన్న అనుమానాలు ప్ర‌స్తుతం ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అదే జ‌రిగితే.. దేశంలో క‌రోనా వైర‌స్ స‌మూహ వ్యాప్తి మొద‌ల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news