కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ ఆలయాలను ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని సిద్ది వినాయక ఆలయం, తుల్జాభవాని ఆలయం, షిరిడీ సాయిబాబా ఆలయాలను మూసివేశారు. ఇక తిరుమలలో కేవలం టైమ్ స్లాట్ దర్శనాలను మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో హైదరాబాద్ నగరం సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
మార్చి 19 నుంచి 25వ తేదీ వరకు చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే నిత్యం స్వామి వారికి జరగాల్సిన పూజలు, అభిషేకాలు అలాగే కొనసాగుతాయని, కానీ భక్తులకు మాత్రం అనుమతి ఉండదని తెలిపారు.
కాగా చిలుకూరు బాలాజీ వీసా దేవుడిగా ప్రసిద్ధిగాంచారు. ఆయన్ను ప్రార్థిస్తే అమెరికా వీసా కచ్చితంగా వస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భక్తులు ఆలయానికి రాకూడదని, ఇండ్లలోనే ఉండి దేవున్ని ప్రార్థించాలని పండితులు తెలిపారు.