ఊరికి కళ వచ్చింది!

-

కరోనా మహమ్మారి భయోత్పాతాలతో పాటు… ఇక చూడము అనుకున్నవాటిని కూడా చూపిస్తోంది. చిన్నప్పుడు బూచాడొస్తున్నాడనగానే, అమ్మ ఒడిలో దూరిపోయిన పిల్లల్లా… కన్నతల్లి లాంటి పల్లె ఒడికి మళ్లీ చేరుతున్నారు. ఎప్పటిలాగే ‘ ఏం కాదు బిడ్డా.. నీకు నేనున్నాను ’ అంటూ ఆ పల్లె తన పిల్లలను అక్కున చేర్చుకుంటోంది.

హాలో.. కొడుకా! బాగున్నవా?

ఆ.. బాగున్న.

నాయినా.. మీ నాయిన ఒంట్లో బాగుంటలేదు. మిమ్ముల సూడాలంటున్నడు. ఒక్కసారి వచ్చి పో కొడకా!

ఆ.. ఇప్పుడేడ వస్తం. పిల్లలకు పరీక్షలు ఉన్నయ్‌. ఆఫీసుల చాలా పనుంది. సెలవులు ఇయ్యరు.

అట్ల అనకు కొడకా! మీ నాయిన నిద్రల కూడా మిమ్మల్ని కవలరిస్తుండు. ఒక్కసారి ముఖం సూపించి పో అయ్యా..! నీ కాళ్లు మొక్కుత.

అమ్మా.. చెప్తే అర్ధమైత లేదా! విసిగించకు. వీలున్నప్పుడు వస్తం లే.

(ఏడుస్తూ..) మీరు కాకపోతే మమ్మల్ని ఎవరు సూడాలయ్యా! ఏం తింటున్నమో.. ఎట్ల ఉంటున్నమో సూడకపోతే ఎట్లయ్యా!

ఇది ఒక తల్లి వేదన కాదు. అనేక మంది తల్లులు మొన్నటి వరకు తమ కొడుకులను వేడుకున్న పరిస్థితే. కానీ కరోనా ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు గానీ! ఇప్పుడు పిలవకపోయినా అంతా ఊరికి వచ్చేసిర్రు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు మొక్కినా కనికరించని మనసులు కరోనా భయానికి తల్లడిల్లాయి. కన్న తల్లిదండ్రుల ఒడి చేరక తప్పలేదు. పెంచిన పల్లెను చూడకా తప్పలేదు. మొన్నటి దాకా ఊరికి పోవడానికి ఒప్పుకోని చాలా ప్రాణాలు ఇప్పుడు సొంతూరును వెతుక్కుంటూ వెళ్లాయి.

కన్న ఊరు.. పెంచిన పల్లె. చదువు చెప్పిన బడి. స్నేహాన్ని పంచిన దోస్తులే మిన్న అంటూ వేగంగా అడుగులు వేశాయి. ఎక్కడ లాక్‌డౌన్‌లో పోలీసులు నిలిపివేస్తారోనని.. పండుగ పేరు చెప్పి, వ్యవసాయం పేరు చెప్పి.. మందులు తేవాలంటూ.. అమ్మానాయినలకు బాగా లేదంటూ సగం పట్నంవాసులు ఎలాగోలా తప్పించుకొని పల్లెకు చేరారు. ఇప్పుడు పల్లె మురిపెం ఎంత బాగున్నదో.. ఏండ్లకేళ్లు పట్నంలో కాలుష్య కాసారాల మధ్య.. ఉరుకుల పరుగుల దినచర్యల మధ్య గడిపిన ప్రాణాలు సేద తీరుతున్నాయి. నెల రోజుల్లో పాత రోజులన్నీ గుర్తుకొచ్చేటట్లు చేసిందీ కరోనా!.  లాక్‌డౌన్‌ ఎత్తేయ్యకపోతేనే బాగు అన్న స్పృహను కలిగించింది.

కనిపెంచిన తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. కళ్ల ముందే కొడుకూ కోడలు, మనవళ్లు, మనవరాళ్లతో ఇల్లు కళకళలాడుతుంటే మురిసిపోతున్న ముసలి ప్రాణాలకు ప్రాణం మళ్లీ లేచిచొచ్చినట్లయ్యింది. మొన్నటి దాకా కలోగంజితో సరి పెట్టుకున్నారు. ఇప్పుడేమో నెల రోజుల నుంచి ఇంట్లో పండుగే. పిల్లల కోసం కారపప్పలు, చెగోడీలు, మురుకులు, లడ్డులు.. పెద్దలకేమో నాటు కోళ్ల రుచి చూపిస్తున్నారు. పిల్లలు వేప చెట్ల కింద ఆడుతున్నరు. పాడుతున్నరు. పట్నం నుంచి వచ్చినోళ్లంతా కల్లు కోసం తాడిచెట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నరు. మరో నెల రోజుల పాటు లాక్‌డౌన్‌ వచ్చినా, పట్నం జీవితం నుంచి పల్లె వాసనను మళ్లీ చూస్తోన్న వారికి ఢోకా లేదు. చేనూ చెలకా చూసుకుంటూ టైం పాస్‌ చేస్తున్నరు. చిన్నప్పటి దోస్తులతో కలిసి బావుల్లో ఈతలు కొడుతున్నారు. ఒక్కో ఊరిలో పదుల సంఖ్యలో పట్నం కుటుంబాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఊర్లోనైతే వందల సంఖ్యలోనే ఉన్నాయి. ప్రతి ఇంటా ఎన్నడూ రాని కొడుకు కూడా కనిపిస్తున్నడు. ఎన్నడూ అత్త ముఖం చూడని కోడలు .. అత్తమ్మా! అంటూ పిలుస్తోంది. ముసలోళ్లు.. ఛీ ఛీ వాసనొస్తదని కన్నోళ్లు చెప్తే ఈసడించుకున్న  పసికూనలు తాతల ఒడిలో ముచ్చట్లు చెబుతున్నాయి. నాన్నమ్మ కథలు చెప్తుంటే ఊ కొడుతున్నయి. జోల పాటలు పాడితే హాయిగా బజ్జొంటున్నయి.

ఇన్నాళ్లు ఏడున్నయో.. ఏమో ఈ ప్రేమాప్యాయతలు..?

ఏదైతేనేం కరోనా భూతం భయపెట్టింది. ఆ భయం ప్రాణాలు నిలుపుకోవాలని చెబుతోంది. అందుకే సురక్షితమైన ప్రాంతాన్ని వెతికాయి. కన్న ఊరే రక్ష రక్ష! అంటున్నయి. పట్నంలోనైతే బయటికి వెళ్లలేరు. ఏ ఇద్దరితో కలిసినా అనుమానమే.. ఏ గుంపును చూసినా భయమే. అందుకే ఇప్పుడు నెల రోజుల నుంచి ఊరికి కళ వచ్చింది! ఇప్పుడు కరోనా వైరస్‌ ఊరికి గౌరవాన్ని తెచ్చింది. పల్లె విలువను కాపాడింది.. కాదు కాదు గుర్తించేటట్లు భయపెట్టింది. పల్లే తల్లని మర్చిపోయిన పట్నవాసులకు తన ప్రేమ తగ్గదని నిరూపించింది.

పొద్దున  ఊరెట్ల ఉన్నదని మా దోస్తుకు ఫోన్‌ చేసిన. దానికి జవాబే ఇది. ఊరు బాగుంది. ఊరికి కళొచ్చిందిరా! అన్నడు. అట్లెట్లా? అంటే ఈ ముచ్చటే తెలిసింది. పొలాల కాడ, బడి కాడ.. చౌరస్తాలో దోస్తుల సందడి కనిపిస్తున్నది. ఐతే ఊర్లల్లో కూడా పోలీసుల ఆంక్షలు ఉండడంతో ఎవరింట్లనే కూర్చొని నాటి ముచ్చట్లు చెప్పుకుంటూ కాలాన్ని వేగంగా కదిపేస్తున్నారు. నలుగురు కలిసి ఇంత కల్లు తెప్పించుకొని ఎంజాయ్‌ చేస్తున్నరు. నాటు కోళ్లు కోయించుకొని జుర్రుకుంటున్నరు. టైం పాస్‌ కావడం లేదన్న ముచ్చటేం లేదు. ఇంకొంచెం టైం ఉంటే బాగుండుననిపిస్తుందని అంటున్నరు. చాలా ఏండ్ల కిత్రం కలవనోళ్లంతా కలుస్తున్నారు. బాగోగులు తెలుసుకుంటున్నరు. ప్రేమ, ఆప్యాయతలకు దారి తీసింది. దోస్తాన్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. అన్నింటికి మించి, సంతోషంతో తల్లిదండ్రుల(ముసలోళ్ల) ఆరోగ్యం కుదుటపడింది. ఆనందమే వారి అనారోగ్యాన్ని దూరం చేస్తోంది. పిల్లలకు అది చేసిపెట్టాలి, ఇది చేసిపెట్టాలి అంటూ క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నా, మందు గోళీలు వేయకపోయినా ఏ నొప్పీ ఇప్పుడు వాళ్ల దరిదాపులకు వస్తలేదు. నా కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు.. ఎప్పుడూ కళ్ల ముందుంటే ఎంత బాగుండోనని మొక్కుకుంటున్నరు.

పది, 20 ఎకరాల సాగు భూమిని వదులుకొని పట్నంలో ప్రైవేటు కొలువులు చేసేందుకు వెళ్లినోళ్లు ఉన్నరు. తోటలను, వరి పొలాలను, పత్తి చేలను ముసలోళ్ల పాలిటికి వదిలేసి వెళ్లిర్రు. ఏదో పండుగో పబ్బానికో ఆ ముసళోళ్లు బతిలాడితే చుట్టపు సూపుగా వచ్చిపోయేటోళ్లు. ఏనాడూ మంచీచెడు అరుసుకున్నోళ్లు కాదు. కానీ ఇప్పుడు మా ఊరే కాదు. మా ఊరి చుట్టూ ఉన్న పల్లెలన్నీ కళకళలాడుతున్నయి.

లాక్‌డౌన్‌తో పట్నంలో చాలా మంది డ్రైవర్లకు పని లేకుండా పోయింది. ప్రైవేటు కొలువులు మూత పడ్డయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇంటి నుంచి పని చేయమని సూచించినయ్‌. ప్రభుత్వ కొలువులు చేసేటోళ్లకు కూడా పల్లెకు పోయే ఛాన్స్‌ దొరికింది. రోజూ డ్యూటీకి పోయే బాధ లేదు. పిల్లలకు బడి లేదు. కాలేజీలు లేవు. కోచింగ్‌ సెంటర్లు మూత పడ్డయి. పోటీ పరీక్షలకు ఇప్పుడు తేదీలు ఖరారు కాలేదు. ఇంకేముంది? పట్నంలో ఉంటే కదల్లేం.. ఉరకలేం. ఈ రెండు చేసేందుకు ఛాన్స్‌ లేదు. పోలీసోళ్లు రూల్స్‌ గుర్తు తెస్తున్నరు. అన్నింటికి మించి పట్నంలోనైతే ఎవరి నుంచి ఎట్ల కరోనా వైరస్‌ సోకుతుందోనని భయపడి చావాలి. ఆ చావు కంటే పల్లె సోయగంలో గడిపించేందుకు వెళ్లారు. ఏదేమైనాపట్నం పల్లె మీదికి వస్తదా? పట్నం పట్నమే.. పల్లె పల్లెనే!

పల్లె తల్లి అయితే, పట్నం భార్య….. తల్లి పాతికేళ్లు కనిపెంచితే, మిగతా జీవితమంతా భార్యతోనే గడపాలి. రెండూ బంధాలే.. రెండూ ప్రేమలే.. దేన్నీ మరువకూడదు.

– మిత్రుడు ఎస్పీకేకు ధన్యవాదాలతో…

Read more RELATED
Recommended to you

Latest news