145 దేశాల్లో కరోనా పంజా.. అమెరికాలో పరిస్థితి ఆందోళనకరం..!

-

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) దాదాపుగా ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఇప్పటి వరకు 145 దేశాల ప్రజలకు కరోనా సోకినట్లు నిర్దారించారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1 లక్షా 45వేల 631 మందికి కరోనా సోకగా, 5423 మంది మృతి చెందారు. అయితే చైనాలో మాత్రం కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ యూరప్‌లో ఆ తీవ్రత రోజు రోజుకీ పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి తెలియజేసింది. కాగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ తమ ఇళ్ల నుంచే సేవలను అందించాలని ఆ సమితి వారికి ఆదేశాలు జారీ చేసింది.

కాగా చైనాలో శుక్రవారం 11 కొత్త కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు అక్కడ 3189 మంది మృతి చెందారు. అలాగే దక్షణి కొరియాలో కొత్తగా 107 మందికి కరోనా సోకగా, 67 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఇక ఇటలీలో పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే అక్కడ 250 మంది చనిపోయారు. దీంతో అక్కడ కరోనా మరణాల సంఖ్య 1266కు చేరుకుంది. అలాగే ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు 150 మందికి కరోనా సోకగా, 35వేల మందిని క్వారంటైన్‌లో ఉంచారు.

ఈక్వెడార్‌లో తొలి కరోనా మరణం సంభవించగా, వెనిజులా, ఉరుగ్వే, గ్వాటిమాలా, సురినామ్‌ దేశాల్లో తాజాగా తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అక్కడ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇక భారత్‌లోని అమెరికా కాన్సులేట్‌లలో మార్చి 16 నుంచి వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికాలో ఉన్న భారత విద్యార్థులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకూడదని వారిని ఇప్పటికే హెచ్చరించామని అక్కడి భారత ఎంబస్సీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వారి కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచామన్నారు. కాగా అమెరికాలో ఇప్పటి వరకు 49 మంది కరోనా కారణంగా మృతి చెందారు. మరో 2వేల మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు.

కరోనా వైరస్‌ కారణంగా కెనడాలో పార్లమెంట్‌ సమావేశాలను రద్దు చేశారు. ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడోను క్వారంటైన్‌లో ఉంచారు. ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో ట్రూడో ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి నుంచే ఆయన సేవలు అందిస్తున్నారు. ఇక కెనడాలో ఇప్పటి వరకు 138 మందికి కరోనా సోకగా, ఒక వ్యక్తి చనిపోయాడు. అలాగే ఇరాన్‌లో 514 మంది కరోనాకు బలయ్యారు. స్పెయిన్‌లో 133 మంది, ఫ్రాన్స్‌లో 79 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version