కరోనా మహమ్మారి మన శరీరంలో ప్రవేశించిన తరువాత ముందుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. తరువాత కొన్ని రోజులకు ఆ వైరస్ వల్ల కిడ్నీలు, లివర్, జీర్ణ వ్యవస్థలు ప్రభావితం అవుతాయని సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది. అయితే ఇప్పుడు తాజాగా వారు చేపట్టిన పరిశోధనల ప్రకారం.. కరోనా నుంచి కోలుకున్న పురుషుల వీర్యంలోనూ ఆ వైరస్ ఉంటుందని తేలింది.
చైనాకు చెందిన పలువురు సైంటిస్టులు కరోనా సోకి రికవరీ అయిన 38 మంది పురుషుల నుంచి వీర్యాన్ని సేకరించారు. అనంతరం ఆ శాంపిల్స్‌ను పరీక్షించారు. చివరకు తెలిసిందేమిటంటే.. మొత్తం 38 మందిలో 6 మంది వీర్యంలో కరోనా వైరస్ ఇంకా ఉన్నట్లు గుర్తించారు. అయితే దీని వల్ల స్త్రీ, పురుషులు శృంగారంలో పాల్గొంటే కరోనా వస్తుందని చెప్పలేమని సైంటిస్టులు అంటున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాలని వారు చెబుతున్నారు.
ప్రస్తుతానికి కరోనా సోకిన వారి నుంచి వెలువడే శ్వాస అణువుల వల్లే ఇతరులకు కరోనా వస్తుందని.. కానీ కరోనా వచ్చిన వ్యక్తుల వీర్యం నుంచి మహిళలకు కరోనా వస్తుందని ఇంకా గుర్తించలేదని సైంటిస్టులు అన్నారు. అయితే దీనిపై సైంటిస్టులు ప్రయోగాలు చేసి త్వరలోనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఈ పరిశోధనకు చెందిన వివరాలను జామా నెట్‌వర్క్ ఓపెన్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.