కరోనాకు మందు దొరికినట్టుంది..?

-

ఆ మందు వాడిన రోగులు వారం రోజుల్లోనే కోలుకుని మొత్తం అందరూ ఇళ్లకు వెళ్లిపోయారట.

షికాగో లోని ఒక ఆసుపత్రి నమ్మశక్యం గాని శుభవార్త ఒకటి వినిపించింది. తమ దగ్గర చికిత్స పొందుతున్న కొవిడ్‌-19 రోగులకు ‘గిలీడ్‌ సైన్సెస్‌’ వారి ‘రెమ్‌డెసివిర్‌’ ఔషధం ఇవ్వడం ద్వారా నయం చేయగలిగామని వారి అంతర్గత సమావేశంలో తెలియజేసింది. ఈ మందు వాడిన తీవ్రరోగులు జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందుల నుండి చాలా వేగంగా కోలుకుని వారం లోపే డిచ్చార్జ్‌ అయి ఇంటికెళ్లిపోయారని ఈ సందర్భంగా తెలిసింది.

‘రెమ్‌డెసివిర్‌’ ఔషధం, కరోనా మీద మెరుగ్గా పనిచేసే అవకాశముందని ముందునుంచీ శాస్త్రవేత్తలు, వైరాలజీ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్‌పై పరిశోధనలు ముమ్మరంగా సాగిస్తున్నారు కూడా.  అయితే గిలీడ్‌ సైన్సెస్‌ వారు ఇందులో ముందడుగు వేసినట్లుగా తెలుస్తోంది. వారి పరిశోధనల సానుకూల ఫలితం కోసం యావత్‌ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ మందు నిజంగానే కొవిడ్‌-19ను సమర్థవంతంగా ఎదుర్కుంటుందని రుజువయితే, సాధ్యమైనంత తొందరగా అన్ని రకాల అనుమతులు పొంది, మొట్టమొదటి కరోనా మందుగా కీర్తి పొందే అవకాశమున్నది.

షికాగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్‌, గిలీడ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 125 మంది కరోనాతో బాధపడుతున్న రోగులను నియమించింది. ఇందులో 115 మంది వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నవారు. వీరికి రోజువారీ డోస్‌ ప్రకారం, ‘రెమ్‌డెసివిర్‌’ ఔషధం ఇచ్చారు. ‘‘ శుభవార్త ఏమిటంటే, దాదాపు అందరు పేషెంట్లు కోలుకుని, డిశ్చార్జ్‌ కాబడ్డారు. ఇది గొప్ప విషయం. మా దగ్గర ఇప్పుడు ఇద్దరే రోగులున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రోగులు కూడా ఈ మందు వాడిన తెల్లారే స్వంతంగా శ్వాస తీసుకోవడం మొదలుపెట్టారు’’ అని అన్నారు యూనివర్సిటీ సంక్రమణ వ్యాధుల నిపుణురాలు కేథలీన్‌ ముల్లానే. ఈ వ్యాఖ్యలు ఆమె తమ ఆధ్యాపక సిబ్బందితో జరిపిన వీడియో చర్చ సందర్భంగా చేసింది. నిజానికి తెలిసింది. ఆ విడియో కాపీని సంపాదించిన ప్రముఖ వైద్య-ఆరోగ్య ఆన్‌లైన్‌ పత్రిక ‘స్టాట్‌ న్యూస్‌’ , ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది.

అయితే, ఈ ఫలితం ఒక చిన్న సాంపిల్‌ మాత్రమేనని, గిలీడ్‌ ఇంకా వేర్వేరు ప్రాంతాల్లో జరుపుతున్న ప్రయోగాల ఫలితాలు తెలియరాలేదని సమాచారం. ఈ విషయం గురించి బయట తెలిసిందని తెలియగానే, గిలీడ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. దాంట్లో ‘‘ ఈ పరిస్థితుల్లో , ప్రస్తుతం మేము జరుపుతున్న రకరకాల ప్రయోగాల ఫలితాలు తేలేవరకు వేచిఉండటమే ఉత్తమమని మా అభిప్రాయం. ఏప్రిల్‌ నెలాఖరులోగా ఫలితాలు వెల్లడవుతాయని ఆశిస్తున్నాము’’ అని ఉంది. అయితే గత నెలలో ఇదే ‘రెమ్‌డెసివిర్‌’ ఔషధం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా గొప్ప ఫలితంగా ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం.  అయితే గిలీడ్‌ మాత్రం మొదటి 400 రోగులపై జరిపిన ప్రయోగాల ఫలితాలను ఓకే చేసిందని విశ్వసనీయ వర్గాల కథనం. అంటే, ఇప్పటినుంచీ ఏరోజైనా అవి విడుదల కావచ్చని అర్థం.

గిలీడ్‌ జరుపుతున్న ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దాదాపు 2400 మంది తీవ్ర కరోనా రోగులు 152 వివిధ ప్రయోగశాలల్లో, 1600 మంది మధ్యస్త రోగులు 169 కేంద్రాలలో ఈ ఔషధాన్ని ట్రయల్‌గా తీసుకుంటున్నారు. అన్నట్లు భారత్‌లోని ఒక ప్రయోగశాల కూడా గిలీడ్‌ పరిశోధనల్లో పాలుపంచుకుంటోదని అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా.  ఈ వార్తలతో స్టాక్‌ మార్కెట్లో గిలీడ్‌ షేర్‌ అమాంతం 8 శాతం ఎగబాకింది.

ఇదే కాకుండా, ప్రపంచదేశాలు చాలా రకాలుగా ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. వాటిల్లో ఆశాజనక ఫలితాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే, కరోనాకు మందు రావడం ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news