చైనాలో పురుడు పోసుకున్న మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వరసగా తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా రకరకాల వేరియంట్ల రూపంలో ప్రపంచంపై దాడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇండియాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా… కొన్ని ప్రాంతాలు మాత్రం హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో వరసగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
మద్రాస్ ఐఐటీ లో కొత్తగా 32 మందికి పరీక్షలు చేయగా.. కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం క్యాంపస్ లో కేసుల సంఖ్య 111కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. క్యాంపస్ లోని వివిధ హాస్టళ్లలోని కరోనా సోకిన విద్యార్థులను ఆ రాష్ట్ర హెల్త్ సెక్రటరీ జే రాధాకృష్ణన్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు వ్యాప్తంగా సోమవారం 55 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 34,53,607 కరోనా కేసులు నమోదు అయ్యాయి.