కరోనా టెస్టులో కొత్త కాన్సెప్ట్.. చర్మంపై జిడ్డుతో కూడా..

2020కి ముందు ఒక చిన్న సూక్ష్మ జీవి కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోతుందని, దానివల్ల నెలల పాటు అన్నీ మూసుకుని ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుందని ఎవరైనా చెబితే, పక్కకెళ్ళు అనేవాళ్ళేమో! అతడి ముఖాన్ని అదోలా చూసి, విపరీతంగా నవ్వుకునేవాళ్ళు. కానీ ఆశ్చర్యకరమైన విషయాలన్నింటినీ పరిచయం చేసే ప్రకృతి, కరోనా ద్వారా భయపెట్టి ప్రపంచాన్ని గడగడలాడించింది. దాదాపుగా కరోనా మన జీవితల్లోకి ప్రవేశించి ఏడాది కావొస్తుంది. ఇంకా దాని పంజా విసురుతూనే ఉంది.

ఐతే ఇప్పుడిప్పుడే కరోనా నుండి ప్రపంచం మెల్లగా కోలుకుంటుంది. టెస్టులు పెంచుతూ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వేగం పెంచుతున్నారు కాబట్టి, దాదాపుగా నియంత్రణలోకి వచ్చేసినట్టే. కానీ కరోనా రూపాంతరాలు ఎప్పుడు ఏ విధంగా అటాక్ చేస్తున్నాయో తెలియదు కాబట్టి, అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఐతే కరోనా పరీక్షల్లో కొత్త కొత్త పద్దతులు వచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు ముక్కు, నోరు లోపలి శ్లేష్మాన్ని పరీక్ష చేసి కరోనా సోకిందా లేదా అని చూస్తున్నారు.

తాజా పరిశోధన ప్రకారం చర్మం ద్వారా కూడా కరోనా పరీక్షలు జరపవచ్చని కనుక్కున్నారు. చర్మంపై ఉండే జిడ్డుని పరీక్షించి కరోనా సోకిందా లేదా అనేది తెలుసుకోవచ్చట. ఈ మేరకు మాంచెస్టర్ లోని వైద్య బృందం 67మందిపై పరీక్ష జరిపి వివరాలు బయటకి వెల్లడి చేసింది. చర్మంపై ఉండే జ్జిడ్డు, కొవ్వు ద్రవాలని పరీక్ష చేసి కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చట. ఐతే ఈ నూతన పరీక్షా విధానాన్ని మరింత మెరుగుపర్చాలని, విస్తృతంగా పరీక్షలు జరిపితే ఖచ్చితమైన ఫలితాలు రాబట్టవచ్చని అన్నారు. మొత్తానికి కరోనా టెస్టుల్లో సరికొత్త పద్దతిని కనుక్కున్నారన్న మాట.