తెలంగాణలో కరోనా విస్తరిస్తున్న వేళ వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకమని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆయన కోఠిలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా పరిస్థితులు కొంతమేర కుదుటపడుతున్నాయన్న ఆయన… కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టం చేసారు.
మే నెలఖారు వరకు అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. వేడుకల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. పాజిటివ్ కేసుల్లో కేవలం 10 శాతం మందికే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం వస్తుందని.. 80 -90 శాతం వరకు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 95 శాతం వరకు ఉందని వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించినప్పుడే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు . సాధారణ లక్షణాలు ఉండి రెండు మూడు రోజులకు గానీ తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. అవసరం లేకుండానే ప్రజలు పరీక్షలు, ఆస్పత్రికి వెళ్లడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడుతుందన్నారు.
రాష్ట్రంలో 50 వేలకు పైగా పడకలు ఏర్పాటు చేశామని, 18 వేలకు పైగా ఆక్సిజన్ పడకలు, 10 వేలకు పైగా ఐసీయూ పడకలు ఉన్నాయన్నారు. ఏడాదిన్నరగా ప్రజారోగ్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఈ సంక్షోభ సమయంలోనూ కుటుంబ, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ప్రజలకు సేవ చేస్తున్నారని గుర్తు చేసారు. సీఎం కేసీఆర్ కూడా కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 45 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక 18 ఏళ్లు పైబడిన వారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.