ఉత్తర కొరియాలో కరోనా వ్యాధి తీవ్రమవుతోంది. గురువారం అక్కడ తొలి కేసు నమోదు అయిన వెంటనే నేషనల్ ఎమర్జెన్సీ, లాక్ డౌన్ విధించారు. అయితే తొలి కేసు నమోదైనట్లు ప్రకటించిన మరుసటి రోజు 6 మంది మరణించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపుగా 3,50,000 మంది జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తొలి కేసు నమోదైన వెంటనే అధ్యక్షుడు కిమ్ పోలిట్ బ్యూరోతో సమావేశం అయ్యారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి వైరస్ ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉత్తర్ కొరియా వ్యాప్తంగా కరోనా వేరియంట్ ఓమిక్రాన్ తీవ్రత పెరుగుతోంది. దేశ సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాలని… వాయు, జల మార్గాల ద్వారా దేశంలోకి వచ్చే వారిని క్షణ్ణంగా తనిఖీలు చేయాలని ఆర్మీని కిమ్ ఆదేశించారు. ఇప్పటికే చైనాలో కరోనా వ్యాధి తీవ్రత పెరిగింది. దీంతో సమీప దేశం అయిన ఉత్తర కొరియాలో కూడా వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. కరోనా ప్రారంభం అయిన గత రెండేళ్లలో నార్త్ కొరియా ఇలాంటి కోవిడ్ విపత్తును ఎదుర్కోవడం ఇదే మొదటి సారి. ఫస్ట్ వేవ్ లో ప్రపంచం అంతా అతలాకుతలం అయినా… నార్త్ కొరియాలో పెద్దగా కేసులు నమోదు కాలేదు.