మసీదుల్లో ప్రార్థనలపై నిషేధం ఎత్తివేసిన పాకిస్థాన్‌

-

రాబోయే రంజాన్‌ పండుగ సందర్భంగా, మసీదుల్లో బృంద ప్రార్థనలపై నిషేధాన్ని ఎత్తివేసిన పాక్‌, మాస్కులు, సామాజిక దూరం మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా దేశంగా ఉన్న పాకిస్తాన్‌, గత ఇరవై రోజులుగా ఉన్న లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించింది. రాబోయే రంజాన్‌ పండుగ సందర్భంగా, మసీదుల్లో ప్రార్థనలను అనుమతించింది. ఇంతకుముందు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ప్రార్థన చేసే వెసులుబాటుండేది.

రంజాన్ ప్రార్థనలను ఇక ముస్లింలు మసీదుల్లో చేసుకోవచ్చనీ, కాకపోతే అత్యంత కఠిన నిబంధనలు పాటించాలని పాక్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మసీదులకు వెళ్లేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ప్రార్థనల సమయంలో విధిగా సామాజిక దూరం పాటించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ, ముస్లిం మత పెద్దల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన మేరకు, మసీదుల్లో ప్రార్థనల సందర్భంగా ఒకరికొకరు ఆరు అడుగుల దూరం పాటించాలని, ప్రార్థనలు ముగిసిన వెంటనే ప్రాంగణం మొత్తాన్ని ప్రమాణాల ప్రకారం శుభ్రపరచాలని పేర్కొన్నారు. మసీదుల్లో ప్రార్థనలను అనుమతించాలని తీవ్ర ఒత్తిడులు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు అనుమతులు జారీ చేసారు. కరాచీలో ప్రార్థనలకు హాజరైనవారికి, పోలీసులకు తీవ్రమైన  గొడవ జరిగడం కూడా ఈ ఆదేశాలకు కారణమైంది. ఇదిలా వుండగా, ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ లాక్‌డౌన్‌ను మరో 14రోజులు పొడిగించారు. అయితే అత్యవసర సేవలను, కొన్ని పరిశ్రమలను ఇందులోనుండి మినహాయించారు.  కరోనా ప్రకోపం మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని. మే నెల మధ్యలో భయంకరంగా ఉండబోతోందని ప్రధాని తన రోజువారీ విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసారు.

కాగా, ప్రస్తుతం పాకిస్తాన్‌లో మొత్తం కరోనా కేసులు 8,418 కాగా, చికిత్స పొందుతున్నవి 6,272. కోలుకుని డిశ్చార్జ్‌ అయినవారు 1970, మరణించిన వారు 176.

Read more RELATED
Recommended to you

Latest news