కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలను ఇప్పటికే చేపట్టారు. అయినప్పటికీ ఎవరూ ఇప్పటి వరకు ఆ ప్రయోగాల్లో చెప్పుకోదగిన ప్రగతి సాధించలేదు. అయితే కరోనా వైరస్‌ను నాశనం చేయడంలో పలువురు సైంటిస్టులు మాత్రం ఇప్పుడు సక్సెస్ అయ్యారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకునే యాంటీ బాడీలను వారు తయారు చేశారు.
కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించగానే ఒక్కో కణంలోకి వెళ్లి దాన్ని నాశనం చేస్తుందని, దీంతో ఊపిరితిత్తులంతటా వైరస్ వ్యాప్తి చెంది ఇన్‌ఫెక్షన్ వస్తుందనే విషయం తెలిసిందే. అయితే వైరస్ శరీరంలోకి మొదట ప్రవేశించినప్పుడే దాన్ని అడ్డుకుని, మన శరీర కణాల్లోకి ఆ వైరస్ ప్రవేశించకుండా చూసే ఓ నూతన తరహా యాంటీ బాడీలను సైంటిస్టులు అభివృద్ధి చేశారు. వాటిని 47D11 యాంటీ బాడీలని పిలుస్తున్నారు.
47D11 యాంటీ బాడీలను ఎలుకల్లోకి ప్రవేశపెట్టాక.. వాటి శరీరంలోకి కరోనా వైరస్‌ను వదిలారు. దీంతో ఆ వైరస్‌ను సదరు యాండీ బాడీలు శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుని వాటిని నాశనం చేశాయి. ఈ క్రమంలో సైంటిస్టులు చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. అయితే ప్రస్తుతం దీన్ని చాలా తక్కువ మొత్తంలో, కేవలం ఎలుకలపైనే చేశారు కానీ.. త్వరలోనే హ్యూమన్ ట్రయల్స్ చేస్తే.. అప్పుడు కోవిడ్ 19కు వ్యాక్సిన్‌ను తయారు చేయడం చాలా సులభతరమవుతుంది. ప్రస్తుతానికి ఈ ప్రయోగం మనకు ఆశాజనకంగా కనిపిస్తుందని పలువురు సైంటిస్టులు కూడా పేర్కొంటున్నారు. ఇక ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ అనే ఓ జర్నల్‌లోనూ ప్రచురించారు.