ఐసీయూ బెడ్‌మీద తాళి క‌ట్టాడు.. కానీ చివ‌ర‌కు!

క‌రోనా విషాదాలు అంతా ఇంతా గాదు. ఎంతోమంది జీవితాల‌ను చిన్నాభిన్నం చేస్తోంది. వారిని న‌మ్ముకున్న వారికి జీవితాంతం బాధ‌ను మిగులుస్తోంది. తల్లిదండ్రుల‌ను పోగొట్టుకున్న పిల్ల‌లు, పిల్ల‌ల్ని పోగొట్టుకున్న ముస‌లివాళ్లు ఇలా.. ఒక్క‌టేమిటీ.. ఏ క‌థ విన్నా క‌న్నీళ్లే. ఇదే క్ర‌మంలో ప్రేమించిన అమ్మాయికి ఐసీయూలోనే తాళి క‌ట్టాడు ఓ యువ‌కుడు.

సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి, ఓ యువ‌కుడు ప్రేమించుకున్నారు. ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడిని ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలనుకుంది ఆయువ‌తి. అంతలోనే ఆమెకు కరోనా సోకింది.

దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ స‌భ్యులు. ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో ఆమెను వెంటిలేటరుపై ఉంచారు డాక్ట‌ర్లు. ఇక ఆమెను ఎలాగైనా కాపాడుకోవాల‌ని ఆసుపత్రి బెడ్‌ మీద ఉన్న యువతి మెడలో తాళి కట్టాడు యువ‌కుడు. కానీ తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచాడు. గ‌త కొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆ యువ‌తి చివ‌ర‌కు కన్నుమూసింది. ఈ క‌థ క‌డు విషాదంగా ముగిసింది.