వీరిని మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చుకోండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

-

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొవిడ్‌ రోగులను చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో పడకల కొరత రాకుండా ప్రైవేట్‌ దవాఖానలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రులు విస్తృత, తీవ్ర లక్షణాలు ఉన్న రోగులను మాత్రమే చేర్చుకోవాలని ఆదేశించింది.

రోగుల్లో ఆక్సిజన్‌ లెవల్స్ 94 శాతం కంటే ఎక్కువగా వుంటే హోం ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించింది. ఇక ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు బయట ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. అలానే కొవిడ్‌ చికిత్సకు అనుమతులు లేని దవాఖానలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. దవాఖాన నిర్వాహకులు రోగులను ఎలాంటి ఇబ్బందికి గురిచేయకుండా చికిత్స అందించాలని సూచించారు.

కాగా తెలంగాణలో సోమవారం కొత్తగా 6,876 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,63,361కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 79,520 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో సోమవారం కరోనాకు 59 మంది బలి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,476కి చేరింది. కాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రస్తుతం సీఎం కేసీఆర్ అధీనంలో ఉంది. మొన్నటి వరకు ఈటల రాజేందర్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ ఈటలను మంత్రి పదవిని తొలగించి స్వయంగా ముఖ్యమంత్రే ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news