జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) క్యాంపస్‌లో ఆదివారం జరిగిన దాడికి సంబంధించి జాతీయ మీడియా దుండగుల ఫోటోలను ఆధారాలతో సహా బయటపెట్టడం సంచలనంగా మారింది. పోలీసులు ఇంకా నిందితులను అదుపులోకి తీసుకోలేదు. దీనితో రంగంలోకి దిగిన జాతియ మీడియా క్షేత్ర స్థాయిలో ఈ దాడి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసినట్టు తెలుస్తుంది.
జెఎన్‌యులో ఫ్రెంచ్ డిగ్రీ ప్రోగ్రాం మొదటి సంవత్సరం విద్యార్థి, అక్షత్ అవస్థీ ఆదివారం దాడి చేసిన ఫుటేజీలో తనను తాను గుర్తించుకోవడ౦ సంచలనంగా మారింది. అలాగే తాను అఖిల్ భారతీయ విద్యా పరిషత్ (ఎబివిపి) కార్యకర్త అని కూడా అంగీకరించాడు. అతను రికార్డుల ప్రాకారం క్యాంపస్ లోని కావేరి హాస్టల్ లో నివసిస్తున్నట్టు మీడియా గుర్తించింది. కారిడార్ లో అతను చక్కర్లు కొట్టిన విధానంతో పాటుగా,
దుండగులను సమీకరించడం వరకు ప్రతీ ఒక్కటి జాతీయ మీడియా తన పరిశోధనలో బయటపెట్టింది. పెరియార్ హాస్టల్‌పై వామపక్ష విద్యార్థులు చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని అవస్థీ జాతీయ మీడియాకు వివరించాడు. తాను కాన్పూర్ లో ఒక ప్రాంతం నుంచి వచ్చా అని అక్కడ ఇవన్ని సర్వ సాధారణమని అతను చెప్పడం విశేషం. ఎబివిపి కార్యకర్తలలో 20 మంది జెఎన్‌యుకు చెందినవారని,
మరో 20 మంది బయటినుండి వచ్చారని, మీడియా ప్రశ్నించగా, తన మాట వాళ్ళు విన్నారని, తాను చెప్పింది చాలా జాగ్రత్తగా చేసారని అతను మీడియాకు వివరించడం గమనార్హం. ఈ దాడుల్లో తాను కూడా పాల్గొన్నా అంటూ అతను కీలక విషయాన్ని చెప్పాడు. నిందితులను తాను సరైన దిశలో నడిపించానని, వాళ్లకు అంత తెలివి లేదని అవస్తీ చెప్పడం చూసి మీడియా కూడా ఆశ్చర్యపోయింది.