అమ్మ ప్రేమ: సృష్టిలో దేవతలకు కూడా దక్కని అపూర్వ బహుమతి మనుషులకు దక్కింది.. ఆ బహుమతి అమ్మే.. అమ్మ అంటే గుర్తుకు వచ్చేవి.. అనుబంధం.. అనురాగం.. ఆత్మీయత.. అన్నింటికీ మించి.. అమ్మంటే మనకు ముందుగా స్ఫురించేది.. ప్రేమ.. సృష్టిలో అమ్మ పంచే ప్రేమ మిగిలిన ప్రేమలకన్నా ఎక్కువ. అది వర్ణించరానిది. అమ్మ ప్రేమ గురించి నిజంగా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచంలో మనం అపురూపంగా చూసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. ఆ వ్యక్తి.. కేవలం అమ్మే..!
దేవుళ్లు, దేవతలు అమృతం తాగి అమరజీవులు అయ్యారు. కానీ వారికి అమ్మ ప్రేమ దక్కలేదు. ఆ అదృష్టం మనకు దక్కింది. అమ్మ మనకు అమృతం ఇవ్వకపోవచ్చు. కానీ అందుకు అతీతమైన ప్రేమను ఇస్తుంది. కన్న తల్లిప్రేమ యావత్ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. మనకు కనిపించే దేవుళ్లలో అమ్మ మొదటి స్థానంలో నిలుస్తుంది.
బ్రహ్మదేవుడు తన సృష్టిలో ఎన్నింటినో సృష్టించాడు. కానీ ఆయన సృష్టించిన అన్నింటిల్లో అమ్మను మించింది ఏదీ లేదు. అమ్మప్రేమ అపురూపం.. ఇక పురాణాలు సైతం మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెబుతూ ముందుగా అమ్మకే ప్రాధాన్యతను ఇచ్చాయి. అమ్మకే మన పెద్దలు కూడా అగ్రతాంబూలం ఇచ్చారు. ప్రపంచంలో ఎన్నో భాషలు, జాతులు, సంస్కృతులకు చెందిన వారు నివసిస్తున్నా.. అమ్మ ప్రేమ అంతటా ఉంటుంది. అది ఎన్నటికీ మారదు. ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలినా అందుకే మనం ముందుగా.. అమ్మా.. అని అరుస్తాం.. అమ్మ స్థానం అంత గొప్పది. కష్టాలో ఉన్న తన బిడ్డలను ఓదారుస్తుంది. వారి ఎదుగుదలను కోరుకుంటుంది. వారు విజయం సాధిస్తే.. తన విజయంలా పొంగిపోతుంది.. అలా ఫీలయ్యే వ్యక్తి కేవలం అమ్మ మాత్రమే..
బిడ్డకు బాధ కలిగితే అమ్మ విలవిలాడిపోతుంది. బిడ్డ ఆరోగ్యం పట్ల పరితపిస్తుంది. బిడ్డకు బాగయ్యే వరకు తాను నిద్రాహారాలు మారుతుంది. తన ప్రేమతో బిడ్డలను ఆరోగ్యవంతులను చేస్తుంది. ఆకలైనా అమ్మే మనకు ముందుగా ఆహారం పెడుతుంది. ఇతరులెవరైనా సరే.. ఆహారం తింటావా.. అని అడుగుతారు. కానీ కేవలం అమ్మ మాత్రమే మనకు అడక్కుండానే భోజనం పెడుతుంది. కడుపు నిండేలా చూస్తుంది. మన కడుపు నింపడం కోసం అమ్మ పస్తులుంటుంది. అందుకనే అమ్మ అంత గొప్ప వ్యక్తి అయింది. ఆమె పంచే ప్రేమ ఒక అమూల్యమైన వస్తువు అయింది. అది అందరికీ దక్కదు..
ఊర్లో ఏదైనా అల్లరి పని చేస్తే.. మనల్ని ముందుగా వెనకేసుకు వచ్చేది అమ్మే.. ఇతరుల ఇండ్లలో వెన్న దొంగిలించిన శ్రీకృష్ణున్ని యశోద సమర్థిస్తుంది. అలాగే అమ్మ మనం చేసే తప్పుల్ని కాస్తుంది. పరీక్షల్లో ఫెయిలైతే నాన్న మనల్ని తిడుతుంటే.. అమ్మ మనల్ని వెనకేసుకు వస్తుంది. ఈసారి కాకపోతే వచ్చేసారి ర్యాంక్ వస్తుందిలే అని అమ్మ మనవైపు ఉండి పోరాడుతుంది. ఇష్టమైనవి కొనాలన్నా.. చిరుతిండి తినాలన్నా.. పాకెట్ మనీ కావాలన్నా.. అవసరం అయితే మనం ముందుగా అమ్మ వద్దకే వెళతాం. అమ్మ తన వద్ద డబ్బు లేకపోయినా… నాన్నతో మాట్లాడి ఏదోలా మనకు పాకెట్ మనీ ఇస్తుంది. అదీ.. అమ్మకు తన బిడ్డల పట్ల ఉండే ప్రేమ.. దాన్ని నిర్వచించడానికి నిజంగా ఎన్ని మాటలు చెప్పినా సరిపోవు..!!