ఆనంద కారక సందర్భాలున్నాయా మీ జీవితంలో ! అయితే అవి మీవి కావు మీ అమ్మగారివి లేదా మీ మాతృమూర్తివి.. అమ్మకు ఏమయినా మనం ఇచ్చేవి కానుకలు అని పేర్లు పెట్టుకుంటే ఓడిపోయి ఓ దగ్గర నిలబడండి ఏం కాదు.. ఈ రోజు మీ గెలుపునకు ఓ దయామయి దీవెన ఉంది అని గుర్తించి పక్కన నిలబడండి.. అమ్మ! జీవితాన్ని త్యాగం చేసిన సందర్భం దగ్గర మీరు ఓడి ఆమెను గెలిపించి రండి.. అప్పుడు మాత్రమే చెప్పండి అమ్మకు వందనం అని! లేదంటే నోటి తుంపర్లు మాత్రమే మిగిలి ఉంటాయి.
బొగ్గు గనుల నుంచి కాసిన్న వజ్రాలు వెలికి వస్తున్నాయి. బొగ్గు గనుల నుంచి కాసిన్ని విజయాలు వెలుగులోకి వస్తున్నాయి. జీవితాన్ని మీరు మార్చుకున్న విధానం ఒకటి గొప్పది. అమ్మానాన్న కేవలం మీ సాధనకు వెన్నంటి ఉండే తోడు మాత్రమే ! అమ్మను మించిన యోధురాలు ఎవ్వరు అని అడిగాడు కేజీఎఫ్ మూవీలో ! అమ్మ ఆశయం బిడ్డలు పెద్దాళ్లవ్వడం కాదు ప్రయోజకులు అవ్వడంలోనే ఉంది అని అంటారు కదా! ఈ ప్రయోజకత్వం అనే పదం దగ్గర బిడ్డలంతా ఓడిపోతున్నారు. వీళ్లు సాధించినవేవీ అమ్మను చేరవు. అమ్మ ఓ నడి రోడ్డున ఉంటుంది. అమ్మ ఒక వృద్ధాశ్రమ నీడలో ఉంటుంది. అమ్మ ఒక కాలువ గట్టుపైన ఉంటుంది. మీరు వెళ్లి పలకరిస్తే పలుకుంది. అందాకే ఆమె పరిమితం. తరువాత ఆమె మీకు ప్రేమను పంచి వెళ్తుంది.
అమ్మకు ఓ స్థానం ఇచ్చిన బిడ్డలంతా బాగున్నారు. ఆమెకు ఏ స్థానం లేకుండా చేసిన వారు కూడా బాగున్నారు. అందుకు కారణం కూడా అమ్మే ! బిడ్డల ఎదుగుదలలో శ్రమని మాత్రం మరిచిన తల్లుల కారణంగా లోకం మరింత స్వార్థమయం అవుతోంది. బిడ్డల నడకలకు నడవడికి కారణం అయిన తల్లులకు ఇవాళ మరో సారి భారం అయిన సందర్భాలు కొన్ని గుర్తుకు వస్తాయి. కనుక ఒంటరి నీడల్లో ఉన్న తల్లులంతా ఏమౌతున్నారు.
మీరు ఆత్మీయంగా పలకరించి పళ్లికిలించి పక్కకు తప్పుకున్న రోజున ఆమె ఏమవుతున్నారు. ఇప్పుడు కూడా ఆమె యోధురాలు.. మిమ్మల్ని కన్న రోజున ఆమె యోధురాలు.. మీరు కాదన్న రోజున కూడా ఏదో ఒక కూడలి చెంత తనదైన ఆశలు నింపుకున్న యోధురాలు. మీరు మీ బిడ్డలను ప్రేమించండి.. వాటితో పాటే కొన్ని నేర్పాలి మీరు.. లేదంటే మీరు కూడళ్ల చెంత కన్నీటి ప్రవాహాల చెంత దిగులు నీడల చెంత నగరాల చెంత పల్లెల చెంత ఒంటరి! గుర్తు పెట్టుకోండి మీ యోధ గుణం కారణంగానే వాళ్లు అలా ఉన్నారు అన్న సంగతి! మాతృదేవో భవ !
ఇలా రాయడంలో ఏ ఔన్నత్యం దాగి ఉందో తెలియదు..తప్పేమో ! ఏ మంచికీ కారణం కాకుండా మనం ఈ సమాజంలో బతికి కాలం నెట్టుకు రావడంలో ఏ ఔన్నత్యం లేదు ఏ ఔదార్యమూ లేదు.. ఏ దాన గుణమూ లేదు.. ఏ సౌభ్రాతత్వమూ లేదు.కనుక యోధ గుణం కారణంగా మనం గెలిచాం.. మన ఔదార్యం కారణంగా మన సహన గుణం కారణంగా అమ్మ గెలవాలి.అమ్మకు సింపుల్ గా వందనం అని చెప్పడంలోనే తప్పులున్నాయి.. ఆ తప్పు నేను చేయను..మీరు కూడా చేయకండి.