మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖే ఎందుకు?

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం! ప్రపంచంలోని అన్ని దేశాల మహిళలు ప్రతి ఏడాది మార్చి 8న ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అంతేగాదు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతోపాటు వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలు ఈ సందర్భంగా ప్రత్యేక సత్కారాలు, పురస్కారాలు అందుకుంటారు. ఈ రోజున విద్యాలయాలు, కార్యాలయాలతోపాటు అన్ని చోట్లా మహిళలు ప్రత్యేక గౌరవ మర్యాదలు అందుకుంటారు. అయితే, ఈ మహిళా దినోత్సవం పూర్వపరాలు ఏమిటి? దీన్ని మార్చి 8న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు? మొదలైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 18వ శతాబ్దం చివరి రోజుల వరకు భారత్‌ లాంటి వర్ధమాన దేశాల్లో వ్యవసాయమే ప్రధాన పరిశ్రమగా ఉండేది. ఇతర పరిశ్రమలేవి పెద్దగా ఉండేవి కావు. అయితే అమెరికా, రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వివిధ రకాల పరిశ్రమలు ఉండేవి. ఆ పరిశ్రమల్లో పురుషులతోపాటు వేలమంది మహిళలు కూడా పనిచేసేవారు.

అయితే, పురుషులతో పోల్చుకుంటే మహిళలకు పనిగంటలు ఎక్కువగా, వేతనాలు తక్కువగా ఉండేవి. మహిళలు రోజుకు 16 గంటలు పనిచేయాల్సి వచ్చేది. దీంతో 1908లో అమెరికాలో మహిళలు తిరగబడ్డారు. ‘పనిగంటలను 16 నుంచి 10కి తగ్గించాలి, పనికితగ్గ వేతనాలు ఇవ్వాలి, ఎన్నికల్లో ఓటువేసే హక్కు కల్పించాలి’ అని డిమాండ్‌ చేస్తూ దాదాపు 15 వేల మంది మహిళలు న్యూయార్క్‌ నరగరంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు.

ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. మహిళలు తొలిసారిగా అంత పెద్ద ఉద్యమం లేవదీయడం పలు దేశాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఉద్యమానికి అండగా నిలిచిన అమెరికాలోని సోషలిస్టు పార్టీ.. ఆ ఉద్యమం మొదలైన రోజును జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అయితే, కార్లా జెట్కిన్‌ అనే నాయకురాలికి ఈ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో జరుపుకోవాలనే ఆలోచన తట్టింది.

అందుకే ఆమె.. 1910లో కోపెన్‌హెగెన్‌ నగరంలో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌’ సదస్సులో అంతర్జాతీ మహిళా దినోత్సవ ప్రతిపాదన చేశారు. దీంతో 17 దేశాల నుంచి సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు 1911లో ప్రపంచంలోనే తొలిసారిగా ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాలు అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలను కూడా నిర్వహించారు. అయితే, ప్రపంచ దేశాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోబట్టి సాంకేతికంగా 108 ఏండ్లవుతున్నప్పటికీ.. ఐక్యరాజ్యసమితి మాత్రం దీన్ని 1975లో గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.

ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది ఏదో ఒక ఇతివృత్తంతో (థీమ్‌తో) మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 1975లో ‘గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం’ అనే థీమ్‌తో మహిళా దినోత్సవరం నిర్వహించింది. కాగా, ‘సమానత్వంతో ఆలోచించండి, మార్పు కోసం సృజనాత్మకంగా పనిచేయండి’ అనేది ఈ ఏడాది నినాదం. అయితే మార్చి 8వ తారీఖునే ఈ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

1908లో న్యూయార్క్‌లో జరిగిన మహిళా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని 1917లో మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా రష్యాలోనూ మహిళలు ఉద్యమించారు. ‘ఆహారం-శాంతి’ కోసం డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. ఈ సమ్మెకు 1908 నాటి న్యూయార్క్‌ నిరసన ప్రదర్శనల కంటే ఎక్కువగా, ఊహించని రీతిలో మద్దతు లభించింది. దీంతో సమ్మె ప్రారంభమైన నాలుగు రోజులకే అప్పటి రష్యా చక్రవర్తి నికోలస్ జా తన సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యింది.

చక్రవర్తి సింహాసనం వదులుకోవడంతో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం మహిళల అన్ని డిమాండ్లకు అంగీకారం తెలిపింది. అంతేగాక మహిళలకు ఓటువేసే హక్కును కూడా కల్పించింది. మహిళలకు ఇంతటి ఘన విజయం సాధించిపెట్టిన ఈ సమ్మె.. అప్పట్లో రష్యాలో అనుసరిస్తున్న జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీన ఆదివారం నాడు ప్రారంభమైంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే మాత్రం అది మార్చి 8వ తేదీ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తుండటంతో మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news