ఐఎండిబి 2019 టాప్‌టెన్‌ భారత సినిమాలు ఇవే..!

-

IMDB ( Internet Movie DataBase) – ఐఎండిబి 2019 సంవత్సరానికి గానూ పది భారత అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. వీటిలో ఎనిమిది హిందీ చిత్రాలు కాగా, ఒక తమిళం, ఒక మలయాళం ఉన్నాయి

ఐఎండిబి – ఇంటర్‌నెట్‌ మూమీ డాటాబేస్‌. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలు, టివీ షోలు, విడియో గేమ్స్‌, ఆన్‌లైన్‌ వీడియోల సమస్త సమాచారం అందుబాటులో ఉండే పోర్టల్‌. సినిమాలు, వాటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, స్థూల కథనాలు, సమీక్షలు.. ఇలా ఒకటేమిటి? అన్ని రకాల సమాచార సమాహారమే ఐఎండిబి. దీని యజమాని అమెజాన్‌. సీఈఓగా ప్రస్తుతం కాల్‌ నీథమ్‌ వ్యవహరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం విడుదలయ్యే సినిమాలలో టాప్‌టెన్‌ చిత్రాల చిట్టాను ఐఎండిబి విడుదల చేస్తుంది. ఈసారి కూడా అలాగే 10 భారత ఉత్తమ చిత్రాల పట్టికను ప్రజలముందుంచింది. ఇవే ఆ చిత్రాలు..

1) పెరుంబు (తమిళం)

దివ్యాంగురాలైన కూతురు, తండ్రి మధ్య అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిన సినిమా. మమ్ముట్టి, అంజలి, సాధన తదితరులు నటించిన ఈ సినిమాకు అంతర్జాతీయంగా ఎంతో పేరుప్రఖ్యాతులొచ్చాయి.

2) యురి-ది సర్జికల్‌ స్ట్రయిక్‌ (హిందీ)


జమ్ము-కశ్మీర్‌ రాష్ట్రం, యురి పట్టణంలోని మిలిటరీ హెడ్‌క్వార్టర్‌పై తీవ్రవాదులు 2016లో భీకర దాడి చేసారు. ఆ సంఘటనను ఆధారంగా చేసుకుని తీసిన కల్పిత సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్‌ సినిమాగా నిలిచింది. నాలుగు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది.

3) గల్లీ బాయ్‌ (హిందీ)


మురికివాడల్లో జీవిస్తూ, సంగీతమే ప్రాణంగా బతికే వీధి గాయకుడి జీవితం నుంచి ప్రేరణ పొంది తీసిన చిత్రమిది. 2019లో బాక్సాఫీసు దుమ్ము దులిపిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరీలో ఆస్కార్‌ అవార్డుకు పంపిన చిత్రం కూడా. నటీనటులు, రణ్‌వీర్‌సింగ్‌, ఆలియాభట్‌. దర్శకత్వం- జోయా అఖ్తర్‌.

4) ఆర్టికల్‌ 15 (హిందీ)


కులం, మతం, వర్ణం, ప్రాంతం, లింగ భేదాల కారణంగా వివక్షను నిరోధించే 15వ అధికరణం గురించి చర్చించిన చిత్రమిది. ప్రత్యేకంగా నిజజీవిత ఘటనలు లేకపోయినా, కొన్ని సంఘటనలనుంచి మాత్రం స్ఫూర్తి పొందారు.ఆయుష్మాన్‌ ఖురానా, నాజర్‌, ఇషా తల్వార్‌ తదితరులు నటించగా, అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించారు.

5) చిచోరే (హిందీ)


1992నుంచి నేటి వరకు ఏడుగురు మిత్రుల జీవన యాత్రపై తీసిన హాస్యరసప్రధాన చిత్రం ‘చిచోరే’. కామెడీ బ్రహ్మాండంగా ఉండటంతో జనాలు విపరీతంగా ఇష్టపడ్డారు. బాక్స్‌ఆఫీస్‌ వద్ద కనకవర్షం కురిపించింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌, శ్రద్ధాకపూర్‌, మన తెలుగు హీరో నవీన్‌ పొలిశెట్టి (ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం) తదితరులు నటించగా, నితేశ్‌ తివారీ దర్శకుడు.

6) సూపర్‌ 30 (హిందీ)


ఆనంద్‌కుమార్‌ అనే భారత విద్యావేత్త, గణిత మేధావి జీవితం ఆధారంగా తీసిన బయోపిక్‌ మూవీ ఇది. ఆనంద్‌కుమార్‌ తన పేదరికం కారణంగా ఉన్నత విద్య , హోదాకు నోచుకోకపోవడంతో, తనలాంటి పేద పిల్లలు 30మందికి ఉచితంగా ఐఐటి కోచింగ్‌ ఇచ్చి, వారికి సీటువచ్చేలా చేస్తాడు. ఆ కార్యక్రమానికి ‘‘సూపర్‌ 30’’ అని పేరు. అదే పేరుతో ఈ సినిమా తీసారు. ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించగా, వికాస్‌ బెహల్‌ దర్శకత్వం వహించారు.

7) బద్లా (హిందీ)


ఒక మహిళా వ్యాపారవేత్త తనపై ఆరోపించబడ్డ హత్యానేరాన్నుంచి కాపాడాల్సిందిగా లాయర్‌ను వేడుకుంటుంది. ఈ కేసు విషయమై లాయర్‌ సాగించే అన్వేషణపై రూపొందించబడిన మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ఇది. స్పెయిన్‌ సినిమా ‘ఇన్విజిబుల్‌ గెస్ట్‌’ కు రీమేక్‌. అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధానపాత్రలలో నటించారు. సుజయ్‌ ఘోష్‌ నిర్దేశకత్వం.

8) ది తాష్కెంట్‌ ఫైల్స్‌ (హిందీ)


భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి అనుమానాస్పద మరణం గురించి అల్లుకున్న కథ ఇది. వాణిజ్యపరంగా పెద్దగా హిట్‌ కాకపోయినా, పేరు మాత్రం బాగానే సంపాదించింది. నసీరుద్దిన్‌ షా, మిథున్‌ చక్రవర్తి, శ్వేతాబసుప్రసాద్‌ తదితరులు నటించారు. వివేక్‌ అగ్రిహోత్రి దర్శకుడు.

9) కేసరి (హిందీ)

1897లో బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీకి చెందిన 21 మంది సిక్కు సైనికులకు, 1500మంది అఫ్ఘన్‌ పష్తూన్‌ గిరిజనులకు మధ్య జరిగిన పోరాటం ఆధారంగా తీసిన చిత్రం. ఈ పోరాటాన్నే ‘సరాగఢీ యుద్ధం’ గా పిలుస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న ఖైబర్‌ కనుమల వద్ద ఈ పోరాటం జరిగింది. అక్షయ్‌కుమార్‌, పరిణితిచోప్రా నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి అనురాగ్‌సింగ్‌ దర్శకత్వం వహించారు.

10) లూసిఫర్‌ (మలయాళం)


మలయాళంలో వచ్చిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సినిమా. కమర్షియల్‌గా కూడా బాగా సక్సెస్‌ అయింది. మోహన్‌లాల్‌, వివేక్‌ ఓబెరాయ్‌, మంజు వారియర్‌ నటించిన ఈ సినిమాకు ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులను ప్రముఖ నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news