కరోనా మహమ్మారి ప్రబలుతున్నప్పటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటి వరకు ప్రజల కోసం ఎన్నో సూచనలు, జాగ్రత్త చర్యలు జారీ చేసింది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే.. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని చెప్పింది. అలాగే కరోనా వ్యాక్సిన్ల పట్ల కూడా ఎప్పటికప్పుడు ఆ సంస్థ అప్‌డేట్లను ఇస్తోంది. అయితే కేవలం మాంసాహారులకు మాత్రమ కరోనా వస్తుందని, శాకాహారులకు కరోనా రావడం లేదని, ఇప్పటి వరకు ఒక్క శాకాహారికి కూడా కరోనా రాలేదని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందనీ.. ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ.. అది నిజమేనా.. అంటే..
కేవలం మాంసాహారులకు మాత్రమే కరోనా వస్తుందనే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, అది అబద్దమని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా వైరస్ మాంసాహారం మాత్రమే కాదు, శాకాహారం వల్ల కూడా రావచ్చని తెలియజేసింది. ఆ వైరస్ ఏ ఆహారంపై అయినా ఉంటుందని.. కనుక మాంసాహారం లేదా శాకాహారం.. ఏదైనా సరే.. ఆహార పదార్థాలను శుభ్రంగా కడిగి.. బాగా ఉడికించి మాత్రమే తినాలని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఇక జంతువుల ద్వారా, జంతు మాంసం ద్వారానే కరోనా వస్తుందనే వార్తల్లో నిజం లేదని, ఇప్పటి వరకు ఆ విషయం శాస్త్రీయంగా నిరూపితం కాలేదని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే వెల్లడించింది. కనుక ఇలాంటి వార్తలను నమ్మకూడదని, శాకాహారులు లేదా మాంసాహారులు ఎవరైనా సరే… ఆ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందేనని.. ఆ సంస్థ వెల్లడించింది.