కుటుంబం మొత్తానికి వినికిడి లోపం.. కానీ ఐఈఎస్ లో ర్యాంకు కొట్టారీ సిస్టర్స్.. ఇంకా చాలా..  

-

ఆ అక్కాచెల్లెల్లు ఇద్దరూ కవలలు. చదువులో నెంబర్ వన్ ర్యాంకర్లు. యూపీఎస్సీ నిర్వహించిన ఐఈఎస్‌(ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌)లో మంచి ర్యాంకులు సాధించారు. ప్లస్‌టూలోనూ ఇలానే అత్యధిక మార్కులు సాధించి వార్తల్లోకి వచ్చారు. చూడముచ్చటగా అనిపిస్తుంది కదూ.. కానీ వీరి జీవితంలో విజయాలతో పాటు.. విషాధం కూడా ఉంది. వీరిద్దరూ బధిరులు. పుట్టుకతోనే వినికిడి లోపంతో జన్మించిన ఈ అక్కాచెల్లెల్లు.. గురించి ఈరోజు మనం తెలుసుకోవాల్సిందే..!
అమ్మ పేరు సీత.. కవలలుగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టేసరికి.. లక్ష్మీ, పార్వతి అని మంచి పేర్లు పెట్టుకుంది. కానీ వారికి వినికిడిలోపం ఉందని తెలిసే సరికి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఏలినాటి శనిలా.. ఈ సమస్య వెంటాడుతునే ఉంది. ఆ తల్లికి వినికిడిలోపమే.. ఇప్పుడు బిడ్డలకు వచ్చింది. కొడుకు విష్ణూకు కూడా ఇదే సమస్య. భర్త అజీకుమార్.. కుటుంబం మొత్తానికి వినికిడిలోపం ఉండటంతో.. ఆడపిల్లలకు రెండేళ్ల వయసున్నప్పుడే.. ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పట్నుంచీ ఒంటరిగా పిల్లలని పెంచి పెద్ద చేశారు సీత. వాళ్లకి ఏడాదిన్నర వయసుండగా సొంతూరు తిరువనంతపురం నుంచి దగ్గర్లోని తిరుమల తీసుకొచ్చి అక్కడి ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌’లో చేర్పించారు. అదే ఆ పిల్లలకు వరమయ్యింది. అక్కడే చిన్నతనం నుంచీ పెదాల కదలికని బట్టి ఎదుటివారి మాటల్ని అర్థం చేసుకోవడం నేర్చుకున్నారు. నాలుగేళ్లు అక్కడ శిక్షణ తీసుకున్నాక సాధారణ పిల్లల బడిలో చేరారు.
సీత తల్లికి కూడా వినికిడిలోపమేనట.. అదే సమస్య సీతకు.. సీత నుంచి వారి పిల్లలకు వచ్చింది. భర్త దూరమవటంతో కుటుంబభారం మొత్తం తన మీదే పడింది. బంధువుల సాయంతో పిల్లలను చదివిస్తూ.. తను( సీత) కూడా చదువుకున్నారు. భర్త చనిపోయిన ఐదేళ్లకి కేరళ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో సీతకు ఉద్యోగం వచ్చింది. అప్పుడే వాళ్ల కష్టాలు కాస్త తీరాయని.. అప్పటివరకూ చాలా ఇబ్బందులు పడ్డామని సీత కన్నీటిపర్యంతమయ్యారు.
ఎన్‌ఐఎస్‌హెచ్‌లో శిక్షణ కారణంగా వినికిడి పరికరాలేమీ లేకుండానే టీచర్‌ చెప్పే పాఠాలని విని కాకుండా, చూసి నేర్చుకుని పదోతరగతి పూర్తి చేశారు లక్ష్మి, పార్వతి. ప్లస్‌టూలో… 1200గాను 1187, 1185 మార్కులు సాధించారు. అప్పుడే వీళ్ల ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. జిల్లా కలెక్టర్‌ ఇంటికొచ్చిమరీ వీరిని ప్రశంసించారు.
ఈ అక్కాచెల్లెలల్కు వినబడదు అంటే.. ఎ‌వరూ నమ్మరట.. టీచర్‌ చెప్పేవన్నీ లిప్‌రీడింగ్‌ సాయంతో రాసుకుంటారు. టీచర్‌ కనిపించకపోతే… తోటివాళ్లని నోట్‌ పుస్తకాలు అడిగి రాసుకోవాల్సిందే’ అంటారు సీత. విష్ణు తిరువనంతపురం కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో చదివి.. ప్రస్తుతం పీడబ్ల్యూడీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతని స్ఫూర్తితోనే ఈ అక్కాచెల్లెళ్లు ఇంజినీరింగ్‌ని కెరియర్‌గా ఎంచుకుని అదే కాలేజీలో చదువు పూర్తిచేశారు.
పార్వతి ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. లక్ష్మి ఎంటెక్‌ పూర్తిచేసి, జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాన్ని సాధించింది. ఇద్దరికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలూ వచ్చాయి. కానీ వాళ్ల లక్ష్యం కోసం ఈ ఉద్యోగాలని కాదనుకున్నారు.
అమ్మ 23ఏళ్ల కష్టం తీరాలన్నా, మా అన్నయ్య కల నెరవేరాలన్నా మేం మా లక్ష్యాన్ని సాధించాలి. మేం సివిల్‌ సర్వీసెస్‌ కొట్టాలనేది అన్నయ్య కల. ఇందుకు యూపీఎస్సీ నిర్వహించే ఐఈఎస్‌ పరీక్షలు 2019 నుంచి రాస్తున్నామని…. ఉద్యోగం చేస్తూనే, వారాంతాల్లో ఈ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవాళ్లని ఈ అక్కాచెల్లెల్లు తెలిపారు.
కట్ చేస్తే. పార్వతికి 74, లక్ష్మికి 75వ ర్యాంకు(సివిల్‌ ఇంజినీరింగ్‌) వచ్చింది. వీళ్ల చిన్నప్పుడు… నీలాంటిదానికి ఇద్దరు ఆడపిల్లలు.. అదీ ఇలాంటి పిల్లలు అవసరమా అని చాలామంది గేలి చేసేవారట… కానీ వాళ్లు సాధించిన విజయం కేరళలో మరెవరూ సాధించలేదు. నాకోడలు ఐశ్వర్య కూడా బధిరురాలే. ఆమె గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తోంది. సాధించడానికి వైకల్యం అడ్డం కాదనడానికి నేనూ, నా కుటుంబమే పెద్ద ఉదాహరణ’ అంటున్నారు సీత. చాలా గొప్ప విషయం కదా.. వినికిడిలోపంతో వాళ్లు ఇంత మంచి ఉద్యోగాలు చేయడం. చాలామంది.. చిన్న కష్టానికే కుంగిపోతారు.. అలాంటివారికి వీరి కథ స్పూర్తిదాయకమే. మనసుంటో బోలెడు మార్గాలు ఉంటాయి అని వీళ్లు మరోసారి నిరూపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version