సెప్టెంబర్ 30 తారీకుతో హుజుర్‌నగర్ ఉప ఎన్నికల నామినేషన్లు ముగిసినయ్…
కట్ చేస్తే..
అక్టోబర్ 1 తారీకున తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్… సోషల్ మీడియా మీటింగ్ అని పెట్టిండు. ఉప ఎన్నికల్లో నామినేషన్ ఏస్తే ఆయనగారి పేరు ఏ పత్రికా రాయలేదని మీడియాను మొత్తం బద్నాం జేసిండు.. బాధ్యతాయుతమైన జర్నలిజం నుంచిరాజకీయాల్లో కి వచ్చిన మల్లన్న నుంచి ఈ తీరును చూస్తే ‘ఏందన్నా మల్లన్న క్యా హువా ఆప్ కో’… అని వినయపూర్వకంగా అనకుండా ఉండలేం…
స్పాట్ విషయం : అన్ని పత్రికలనూ తిట్టిండు..
ఆశ్చర్యం : పేరిచ్చిన వీ6వెలుగు పత్రికనూ కూడా అడ్డంగా వేస్కున్నడు.
అనుమానం : తిన్నింటి వాసాలు ఏమన్న లెక్కవెట్టే అలవాటుందా?
ఆటిట్యూడ్: ఏ పూటకూ ఆ గొడుగు పట్టుకోవడం, గూడు మారడం
అలవాటు : ప‌్రతి దానికీ కెమెరా ముందుకు వచ్చి అందరినీ బండ బూతులు తిట్టడం.
‘వాడిని అలా వదిలేకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా’ అనేది ఒక సినిమాలో ఫేమస్ డైలాగ్.. నిజంగా ఈ డైలాగును తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కు అప్లయ్ చేసి చూస్తే కరెక్ట్ గా సరిపోద్దేమో అనిపిస్తుంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసిండు. ఆయన పేరు, వార్తన ఏ పత్రికలో రాలేదు అని మీటింగ్ వెట్టి మీడియా మొత్తం ఈనాడు దగ్గర నుంచి – ఆంధ్ర ప్రభ దాకా అన్నిటినీ తిట్టినంత పని వెట్టుకున్నడు. మరి నిజంగా మల్లన్న పేరు కానీ, నామినేషన్ వార్త కానీ ఏ పేపర్లో రాలేదా
నిజానికి తీన్మార్ మల్లన్నకు ఎలక్షన్లు, వార్తలు, రాజకీయాలు, విమర్శించడాలు కొత్తేమీ కాదు. కానీ అవి పూర్తి నిర్మాణాత్మకంగా ఉండకపోవడమే మల్లన్నకు ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తుందనిపిస్తుంది. ఒక్కోసారి సోషల్ మీడియాలో ఇలా ‘అజ్ఞాన ప్రదర్శనలు’ ఇవ్వడం చూస్తే అది నిజమే అనిపిస్తుంది కూడా..ఆయన లింకు పెట్టుకోని పార్టీ లేదు, పంచుకోని వేదికా లేదు. తిరగని మీడియా సంస్థ లేదు. విమర్శించని మనిషీ లేడు. మల్లన్న లో ఈ చంచలత్వం చూస్తే నిజంగా మల్లన్నకు ఏమైనా తిరుగుడు రోగం ఉందా? లేక తిన్నింటి వాసాలు లేక్కెట్టే అలవాటుందా అనిపస్తుంది. ఎందుకంటే తొలుత 2015 ఈయన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి వేసిండు.
కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా వచ్చి ప్రచారం చేసిండ్రు. ఆ టైంలోనే కాంగ్రెస్ మీద ఓ ఖతర్నాక్ పాట రాసి యూట్యూబ్ ల వెట్టిండు. మరి ఏమైంది? కాంగ్రెస్‌తో అంటకాగలేదేమో.. మొన్న వెట్టిన తెలంగాణ జన సమితి వేదికలూ పంచుకున్నడు. అదీ కాదని తెలంగాణ ఇంటి పార్టినీ కొన్నాళ్లు మోసిండు. ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో స్వతంత్ర్య అభ్యర్థిగా హుజుర్‌నగర్‌లో పోటీ చేస్తుండు. 83 మంది అభ్యర్థులో మల్లన్న ఒక స్వతంత్ర్య అభ్యర్థి.
రాజకీయాలో విషయం అటుంచితే మీడియాలో మల్లన్న గురించి ఇప్పుడు చూద్దాం..
తీన్మార్ మల్లన్న పురాతన కాలంలో ఎక్కడ జేసిండో మనకు తెలియదు కానీ వీ6 నుంచి మంచి పేరుతెచ్చకున్నడు. తెలంగాణ ప్రజలకు దగ్గరైండు. ఇప్పటికీ ఆయన అసలు పేరుకూడా చాలామందికి తెలియదు. తీన్మార్ మల్లన్న అని వీ6 అంతటి పేరు ఇచ్చింది. ఇయ్యల్ల ఎలక్షన్లల్ల కూడా అదే పేరుతో ప్రచారం అవుతున్నాడు. వీ6 అయిపోయింది. డైరెక్ట్ 10టీవీలకు వచ్చిండు. అక్కడా తీన్మార్ వార్తలు జెప్పిండు. 10టీవీ కథ సమర్పయామీ కాగానే మళ్లీ ఇప్పుడేదో టీవీలకు పోయిండు. ఎక్కడ వీలుంటే, ఎక్కడ వార్తలు రాసే అవకాశం ఉంటే అక్కడికి వెళ్లడం అది అతని వ్యక్తిగతం. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇన్నేండ్లు మీడియాలో పని చేసి, జర్నలిస్టుగా పేరు తెచ్చకొని ఇయ్యల్ల మీడియానే బద్నాం జేసే పని చేస్తుండు మల్లన్న..
ఇది ఆయన కొత్తగ చేస్తున్నది కాదు. 10 టీవీ నుంచి బయటకు వచ్చి ఆ కంపెనీ మీదే విపరీత ఆరోపనలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది అందరికీ తెలిసిందే. సరే 10 టీవీలో స్ర్టింగ్ ఆపరేషన్ చేసిండే అనుకుందాం. కామ్రేడ్లను తిట్టడం దేనికి? పోని హుజుర్‌నగర్ మీటింగ్‌ల వీ6 వెలుగును కూడా అధ్వన్నంగా తిట్టిండు. యాజమాన్యాన్ని ధూషించిండు. పని చేసి, పేరిచ్చిన కంపెనీని ఎవ్వరైనా అట్లా తిడుతరా? అదీ జర్నలిస్టుల నైతికతనా? అసలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ప్రజాపక్షం ఇట్లా ఏ పత్రికనూ వదలకుండా పబ్లిక్‌గా ధూషనల పర్వం కొనసాగించిండు. ఒక జర్నలిస్టుగా చేసిన వ్యక్తి ఎవరైనా ఇట్లా ప్రవర్తిస్తరా? పత్రికల విలువలను దిగజార్చినట్టే కదా? పత్రికలంటే ప్రజల్లో ఎంతటి విశ్వాసం ఉంటది? సరే.. పత్రికలు మల్లన్న విషయంలో అన్యాయంగానే ఉంటే మల్లన్న మాటలకు, ఆవేదనకు అర్థం ఉంటది అనుకోవచ్చు.. కానీ అసలు విషయం ఏంటీ?
ఎన్నికలకు నామినేషన్ వేసినా .. ఒక్క పేపర్ కూడా వార్త రాయలేదు, ఆయన పేరు రాయలేదని ఈ సోషల్ మీడియా మీటింగ్ సారాంశం. మరినిజంగానే పత్రికలు వార్త రాయలేదా? మల్లన్న పేరును చూపించలేదా? మల్లన్న ఆవేదనలో నిజమెంత చూద్దాం.
హుజుర్‌నగర్‌లో ఎమ్మెల్యే స్థానానికి 76 మంది, 119 నామినేషన్లు వేసిండ్రు. అందులో ప్రధాన పార్టీలు, చిన్నపార్టీలు, వివిధ సంఘాలు, స్వతంత్ర్య అభ్యార్థులు ఉన్నారు. ఇంత మందిలో మల్లన్న ఒక స్వతంత్ర్య అభ్యర్తి. తెలంగాణలో అతనికి ఫేమ్ ఉండొచ్చు, బలగం ఉండచ్చు, సైన్యం ఉండొచ్చు వార్తా విషయానికి వస్తే ప్రొటోకాల్ ఉంటది కదా? ఎక్కువ వివరాలతో పెద్ద వార్త జిల్లా పేజీలో, సమాచారం కోసం రాష్ర్ట పేజీలో ఏ పత్రికైనా పెడుతుంది. నామినేషన్ల వార్త దాదాపూ అన్ని పత్రికల్లో వచ్చింది. అది అటుంచితే 119 నామినేషన్లలో మల్లన్న అనే ఒక స్వతంత్ర్య అభ్యర్థికి వార్తలో ప్రధాన పార్టీలను కాదని ఎలా దక్కుతుంది? ప‌్రధాన పార్టీ అభ్యర్థులవి మినహా మిగతా అందరి పేర్లు పత్రికలు ప్రచురించాలంటే సాధ్యం అవుతుందా? సహజంగానే స్వతంత్ర్య అభ్యర్థుల పేర్లు ప్రచురించవు… అయినా కూడా… సాక్షి, అంధ్రజ్యోతి ‘నవీన్’ అని ఎవరికీ తెలియని ఈ స్వతంత్ర్య అభ్యర్తి పేరు అందరికీ తెలిసిన ‘తీన్మార్ మల్లన్న’ అని నామినేషన్ల వార్తలో ప్రచురించాయి. పాపం ‘సాక్షి’ అయితే జిల్లా పేజీలోనూ, రాష్ర్ట పేజీలో ‘తెలంగాణ ఇంటిపార్టీ మద్దతుతో తీన్మార్ మల్లన్న నామినేషన్ వేశారు’ అని ఎక్కువనే రాసింది. అయినా పాపం సాక్షిని ఆధ్వన్నంగా ‘జగన్ పత్రికని, కేసీఆర్ కు ఏమైనా అయితే ఇదే కాపాడుతది’ అని ఎన్నో మాటలన్నడు. ఆకరికీ ఆంధ్రజ్యోతి పత్రికను కూడా ‘సెన్సెషన్ పత్రిక’ అని, ‘జనం గురించి పట్టదన్న’డు. పాపం మల్లన్న ..అంధ్రజ్యోతి పేపర్ల ‘రెండో పేజీల’ వచ్చిన నామినేషన్ల వార్తల ఆయన పేరు చూసుకొని వస్తే ‘ఆంధ్రజ్యోతి’ని ఇంత మాట అనకపోతుండెనేమో. సరే ‘వీ6 వెలుగు’ల రాలేదు అంటే ఆయన వీ6లో చేసి మంచి సంబంధాలు పెట్టుకొని ఉంటే ఇయ్యల్ల మంచిగుంటుండెనెమో. బయటకొచ్చి చానెల్ గురించి, యాజమాన్యం గురించి ఎట్లాంటి ప్రచారం జేసిండో అందుకే వాళ్లు కంట్లె వెట్టుకున్నరు కావచ్చు అనిపిస్తుంది.
రాష్ర్టంలో 199 అసెంబ్లీ స్థానాల్లో ఒక అసెంబ్లీ హుజూర్‌నగర్.. అక్కడ ఉప ఎన్నికలకు స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేస్తే పేరు రాలేదని గించుకోవడం ఎందో వాళ్లకే అర్థం కావాలి. అతను పెద్దోడు, తెలంగాణ ఫేమ్ ఉంది, ఎన్నికల్లో నిలవడుతున్న అని అతనికి అతనువెరీ ఇంపార్టెంట్‌గా అనిపించవచ్చు, ప్రోగ్రామ్ పెట్టినోడికి ఆ ప్రోగ్రామే ఇంపార్టెంట్ అనిపిస్తది. కానీ అలాంటివి వార్తగా వచ్చే సరికి దానికి ఉండాల్సిన ప్రాధాన్యం దానికే ఉంటదని పేపర్లు అనుకుంటాయి. కాబట్టి మల్లన్న సగం జర్నలిస్టుగా, సగం రాజకీయ నాయకుడు ( సారీ నాయకుడు అనలేం కానీ) రాజకీయ అభ్యర్థిగా, సగం విమర్శకునిగా, సగం ఆపార్టీల, సగం ఈ పార్టీల, సగం బజార్ల, సగం ఇంట్ల ఉంటే ఇట్లా పేపర్లు చూడకుండా కొయ్యో మొర్రో అని మొత్తుకునుడు తప్పది. ఇంకోటీ ‘పత్రికలతో సంబంధాలు అంటే పాలొల్లలెక్క’ అని మల్లన్నకు తెలియకుండా ఉండది. ఇలాంటి ఎన్నికల టైంలో గిట్ల పత్రికలను బద్నాం జేసుడు ఏమైనా అవగాహన ఉందా ? ఉంటే గిట్ల సగం పార్టీలల్ల, సగం సగం మీడియాల ఎందుకు పని జేస్తాడు అంటారా? అప్పటికైనా మల్లన్న రోజూ పేపర్లు జూసీ,మట్లాడే అంశాల మీద మంచి కమాండ్ దెచ్చుకోని మాట్లాడడం మంచింది. ఇట్లా అజ్ఞాన ప్రదర్శనలిస్తే ఎన్నేండ్లయినా ఎన్నికల్లో నామినేషన్లు వేస్తనే ఉంటరు అనే అభిప్రాయం జనాల్లో ఏర్పడకపోదు..