లక్కు తోక తొక్కాడు.. పర్సు పోయినా.. 36 కోట్లు లాటరీ తగిలింది..!

-

లక్కు తోక తొక్కడమంటే ఇదే కాబోలు. లేకపోతే ఏంటండి… ఓ వ్యక్తి తన పర్సును పోగొట్టుకున్నాడు. కానీ.. అది పోయినందువల్లే 36 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అర్థం కాలేదా? రండి ఓసారి లండన్ వెళ్లొద్దాం.

 

ప్రైవేట్ జాబ్ చేసే ఓ వ్యక్తి పర్సును దొంగలు కొట్టేశారు. అయ్యో నా పర్సు పోయింది దేవుడోయ్.. అంటూ ఎంతో దిగులు చెందాడు. అంతేనా… మనోడి నెల జీతం డబ్బులన్నీ ఆ పర్సులోనే ఉన్నాయి.. డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా అందులోనే ఉన్నాయి. పర్సును దొంగలించిన ఇద్దరు దొంగలు.. అందులో ఉన్న డబ్బునంతా ఖర్చు పెట్టి డెబిట్ కార్డులను కూడా వాడేసుకొని చివరకు ఆ డెబిట్ కార్డుతో పది పౌండ్లు పెట్టి లాటరీ టికెట్ కొన్నారు. దానికి ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది. ఆ కార్డును గీకి చూశారు. దీంతో వాళ్ల దిమ్మతిరిగిపోయింది. కళ్లు బైర్లు కమ్మాయి. ఎందుకంటే.. వాళ్లకు ఆ లాటరీలో ఎంత తగిలిందో తెలుసా? 4 మిలియన్ పౌండ్లు. అంటే మన కరెన్సీలో 36 కోట్లు.

ఇక.. ఎలాగైనా ఈ చిల్లర దొంగతనాలను ఆపేసి.. ఆ డబ్బుతో దర్జాగా బతికేయొచ్చని అనుకున్నారు. వెంటనే లాటరీ నిర్వాహకుల దగ్గరికి వెళ్లారు. లాటరీ నిర్వాహకులు క్యాష్ ను డైరెక్ట్ గా ఇవ్వడం కుదరదని.. అకౌంట్ లో వేస్తామని.. అకౌంట్ వివరాలు చెప్పాలన్నారు. ఆ దొంగలకు అంత తెలివి లేనట్టుంది. అకౌంట్ నెంబర్ తమ వద్ద లేదన్నారు. దీంతో లాటరీ నిర్వాహకులకు అనుమానం వచ్చింది.

అసలు.. స్క్రాచ్ కార్డు వీళ్లదేనా? వీళ్లు డబ్బులు ఎలా కట్టారో చెక్ చేశారు. దీంతో లాటరీ డబ్బులు… డెబిట్ కార్డు ద్వారా కట్టారని తెలుసుకున్న లాటరీ నిర్వాహకులు.. ఆ డెబిట్ కార్డు వీళ్లది కాదని అనుమానించి… పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరినీ పట్టుకొని నాలుగు అంటిస్తే అసలు నిజం కక్కేశారు.

దీంతో.. రూల్స్ ప్రకారం… డెబిట్ కార్డు ద్వారా డబ్బులు కట్టారు కాబట్టి… డెబిట్ కార్డు ఎవరి పేరు మీద ఉంటే వారిదే లాటరీ డబ్బు అని ప్రకటించారు. అంతే కాదు.. డెబిట్ కార్డు హోల్డర్ కు సమాచారం అందించారు. దీంతో ఆ వ్యక్తి నమ్మలేకపోయాడు. ఉబ్బితబ్బిబ్బయ్యాడు. పర్సు పోతే పోయింది కానీ.. తనను కోటీశ్వరుడిని చేసిందని తెగ ఖుషీ అయిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version