హాజీపూర్ హత్యలు – విస్తుగొలిపే వాస్తవాలు..

-

యాదాద్రి-భువనగిరి జిల్లా, బొమ్మల రామారం – ఈ మండలంలో ఓ కుగ్రామం. పేరు హాజీపూర్‌. హఠాత్తుగా ఈ పేరు మీడియాలో మార్మోగుతోంది. కారణం, హత్యలు. అవి కూడా అమ్మాయిలవి. అమ్మాయిలను మానభంగం చేసి, హత్య చేసి ఒక పాడుపడిన బావిలో పాతేస్తున్నాడు ఓ ఉన్మాది.

ఓ పాడుపడ్డ బావి. ఊరుకి ముందుగానే ఉంటుంది. నీళ్లు ఉండవు. గ్రామస్థులందరూ ఆ బావి పక్కనుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు ఆదే బావి సంచలనాలకు కేంద్రబిందువయింది. వరుసగా అమ్మాయిల శవాలు బయటపడుతున్నాయి.

పాముల శ్రావణి(14) అదే హాజీపూర్‌లో ఉంటుంది. ప్రతిరోజు బడికి వెళ్లి వస్తోంది. గత గురువారం అలాగే స్కూల్‌కి వెళ్లింది. కానీ, తిరిగి రాలేదు. ఇదే బావిలో శవమై లభించింది. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. నిన్న శ్రావణి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అదే బావిలో ఇంకో అమ్మాయి అస్థికలు కనిపించాయి. నెల రోజుల క్రితం మాయమైన మనీషా(18)గా ఎముకలతోపాటు లభించిన బ్యాగు, ఐడీకార్డును బట్టి గుర్తించారు. ఈ అమ్మాయి విషయమై తల్లిదండ్రులు పోలీసులకు ఎలాంటి కంప్లయింట్ ఇవ్వలేదు. ఎవరినో పెళ్లిచేసుకుని వెళ్లిపోయిందని అనుకుంటున్నారట. దీంతో ఉలిక్కిపడ్డ పోలీసులు కేసును ఇక సీరియస్‌గా తీసుకున్నారు. ఇంకోపక్క మూడేళ్ల క్రితం మరో అమ్మాయి కల్పన (11) తన ఊరినుండి అమ్మమ్మగారి ఊరైన హాజీపూర్‌కు వెళ్లివస్తూ, మాయమైంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అప్పుడే కేసు పెట్టినా, నేటికీ ఎటువంటి పురోగతి కన్పించలేదు.

అ ఆమ్మాయి కూడా ఇదే బావిలో శవమై ఉంటుందా అని ఆ తల్లిదండ్రుల రోదన. శ్రావణి హత్యకు రెండు నెలల క్రితం కూలిపని చేసుకుని బతుకుతున్న ఓ మహిళ కూడా అత్యాచారానికి, హత్యకు బలయిందని గ్రామస్థుల కథనం. అది కూడా పోలీసులకు తెలియదు. క్రమంగా కేసు భయంకరంగా తయారవుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం దిద్దుబాబు చర్యలు ప్రారంభించింది. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసారు. బావి చుట్టూ కంచె కట్టారు. ఎవరూ ఇటువైపు రాకుండా కాపలా ఉంటున్నారు. అయితే ఆ కిరాతకుడు ఎవరంటే, అన్ని వేళ్లు అతడినే చూపిస్తున్నాయి. అతడే శ్రీనివాస్‌రెడ్డి.

శ్రీనివాస్‌రెడ్డి (30) అనే యువకుడు ఈ ఘోరాలన్నింటికీ సూత్రధారి అని గ్రామస్థుల, పోలీసుల అనుమానం. ఆ పాడుబడ్డ బావి అతడిదే. దాని పక్కన ఇంకోబావి ఉంది. అది కూడా అతడిదే. హాజీపూర్‌ గ్రామమే అతడి నివాసం. తల్లిదండ్రులున్నారు. కొంచెం వ్యవసాయం ఉంది. కానీ, స్థిమితంగా ఉండలేక, కర్నూలు వెళ్లిపోయాడు. అక్కడ లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేసాడు. అది నచ్చక, మళ్లీ సొంతూరుకు వచ్చాడు. కర్నూలులో శ్రీనివాస్‌రెడ్డి పనిచేసేప్పుడే అక్కడ ఒక మహిళ, అత్యాచారానికి, హత్యకు గురైంది. అది కూడా ఇతనే చేసిఉంటాడని పోలీసుల అనుమానం. మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ శ్రీనివాస్‌రెడ్డి, ఉన్మాదిగా మారి ఈ హత్యలు చేస్తున్నట్లుగా గ్రామస్థులు చెబుతున్నారు. అతడితో గ్రామస్థులకు కూడా పెద్దగా సంబంధాలు లేవని సమాచారం.

గంజాయి తీసుకున్నప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తాడని, అదే మత్తులో ఈ దారుణాలకు ఒడిగట్టాడని చెపుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతనికి ఎవరెవరు సహకరించారు? ఇంకెవరినైనా ఇలాగే చంపేసాడా? అనే విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, ఆ రెండు బావుల్లో పూర్తిస్థాయి తవ్వకాలను జరిపి, నిజానిజాలు వెలికితీయాలని పోలీసులను ఆదేశించారు. కాగా, తీవ్ర కోపోద్రిక్తులైన గ్రామస్థులు ఈరోజు ఉదయం శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని తగులపెట్టారు. గ్రామం మొత్తం తీవ్ర ఉద్రిక్తతతో ఉండడంతో పోలీసులు భారీగా హాజీపూర్‌కు చేరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version