18 కిలోమీటర్ల దూరానికి రూ.4300 చార్జి వసూలు చేసిన ఆటోవాలా..!

-

బెంగ‌ళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి పూణెలో ఆటోలో 18 కిలోమీట‌ర్ల దూరం వెళితే.. డ్రైవ‌ర్ రూ.4300 చార్జి వ‌సూలు చేశాడు. ఆ వ్య‌క్తి ఈ విష‌యంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

ఊరు కాని ఊరు.. అందరూ కొత్తవారే.. భాష వచ్చినా.. అక్కడి ప్రదేశాలు మాత్రం తెలియవు కదా. కనుక సొంతంగా వాహనంలో వెళ్లడం కన్నా చాలా మంది క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తుంటారు. ఆ వ్యక్తి కూడా సరిగ్గా అలాగే చేశాడు. కానీ ఆ ఆటోడ్రైవర్ మాత్రం అతనికి ఏకంగా రూ.4300 చార్జి వేశాడు. అవును.. నిజమే.. పూణెలో జరిగిందీ ఘటన..!

pune auto driver charged rs 4300 for 18 kilometers journey

బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగికి పూణెలో ఇటీవలే జాబ్ వచ్చింది. అక్కడి ఎరవాడ అనే ప్రాంతంలో కంపెనీ వసతి కల్పించింది. అయితే అతను కాట్‌రాజ్ అనే ఏరియాలో దిగాడు. అక్కడి నుంచి ఎరవాడకు వెళ్లాలి. కానీ క్యాబ్ బుక్ చేసుకుందామంటే సిటీ శివారు కనుక సర్వీసులు లేవు. దీంతో అక్కడే ఓ ఆటో మాట్లాడుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎరవాడకు చేరుకున్నాడు.

అయితే ఎరవాడకు చేరాక ఆటో డ్రైవర్ ఆ ఐటీ ఉద్యోగికి ఏకంగా రూ.4300 చార్జి అయిందని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారే ఖంగు తిన్నాడు. కేవలం 18 కిలోమీటర్ల దూరానికి అంత చార్జి ఎలా అవుతుందని ప్రశ్నించాడు. అందుకు గాను ఆ ఆటోడ్రైవర్ శివారు నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యేందుకు రూ.600, మళ్లీ బయటకు వెళ్లేందుకు రూ.600 మొత్తం కలిపి రూ.1200 పోను మిగిలింది ఆటో చార్జి అని చెప్పాడు. ఈ క్రమంలో ఎంత వాదించినా ఆ ఆటోడ్రైవర్ వినకపోవడంతో అతను రూ.4300 చెల్లించి వెళ్లిపోయాడు. అయితే ఈ విషయంపై ఆ ఉద్యోగి ఎరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అంత పెద్ద మొత్తంలో చార్జిలు అసలు ఉండవని, ఆ ఆటోడ్రైవర్ కావాలనే మోసం చేశాడని పోలీసులు ఆ వ్యక్తికి చెప్పారు. అయినా.. మన ఖర్మ బాగాలేకపోతే ఇలాంటి కష్టాలు ఒక్కోసారి అనుభవించక తప్పదు.. అంతేకదా..!

Read more RELATED
Recommended to you

Latest news