హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ స్టోర్స్ వారు ఒక్కోసారి భారీ సైజ్ ఉండే ఆహారాలను తయారు చేసి వాటిని తినాలని చెప్పి చాలెంజ్‌ల పేరిట కస్టమర్లకు పోటీలను నిర్వహిస్తుంటారు. వారి వ్యాపారం కోసమే అయినప్పటికీ కొన్ని సార్లు వారు తయారు చేసే అలాంటి ఆహారాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాయి. ఆస్ట్రేలియాలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న థాల్లన్ అనే ప్రాంతంలోని ది నిండిగల్లీ అనే పబ్‌లో వినూత్న చాలెంజ్ పెట్టారు. ఆ పబ్ వారు సుమారుగా రెండున్నర కిలోల బరువు ఉన్న ఓ భారీ బర్గర్‌ను తయారు చేశారు. అందులో ఉంచిన మాంసం బరువే సుమారుగా 1.2 కిలోలు ఉంటుంది. ఇక మిగిలిన పదార్థాలు అన్నీ కలిపి మరో కిలోకు పైగా బరువు ఉంటాయి. ఈ క్రమంలో రెండున్నర కిలోల బరువు ఉన్న బర్గర్‌ను వారు రూపొందించారు.
ఇక ఆ బర్గర్‌ను ఎవరైనా తినవచ్చని ఆ పబ్ వారు చాలెంజ్ విసిరారు. కానీ ఇప్పటి వరకు ఆ చాలెంజ్‌ను అయితే ఎవరూ స్వీకరించలేదు. ఆ బర్గర్‌ను సాధారణంగా 4 నుంచి 5 మంది తింటారు. కానీ దాన్ని ఒక్కరే తినాల్సి ఉంటుంది. అయితే చాలెంజ్‌ను ఎవరూ స్వీకరించలేకపోయినప్పటికీ ఆ బర్గర్ మాత్రం భారీ సైజ్ ఉండడంతో అందరినీ ఆకర్షిస్తోంది.