మనకు ఒక గొర్రెను కొనుగోలు చేస్తే సహజంగానే ఎంత ధర పలుకుతుంది ? పొట్టేలు అయితే రూ.10వేల నుంచి రూ.20వేల మధ్యలో ఉంటుంది. కొంచెం నాణ్యమైన జాతికి చెందిన గొర్రెలు అయితే ఇంకా కొంచెం ఎక్కువ ధర పలుకుతాయి. కానీ ఆ గొర్రె మాత్రం చాలా ప్రత్యేకం. ధాని ధర ఏకంగా రూ.కోట్లలో ఉంది. ఏంటీ.. ఆశ్చర్యపోయారా ? అయినా ఇది నిజమే. ఇంతకీ ఆ గొర్రె ఎక్కడుంది ? దాని ప్రత్యేకతలు ఏమిటి ? అంటే…
మహారాష్ట్రలోని సంగ్లి జిల్లా జాట్ తాలూకాలో మడ్‌గ్యాల్ జాతికి చెందిన గొర్రెలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. నిజానికి ఆ జిల్లాలో ఆ గొర్రెల సంఖ్య ఎక్కువ. చాలా మంది ఆ జాతికి చెందిన గొర్రెలను పెంచుతుంటారు. అయితే అక్కడ ఉండే బాబు మెట్‌కరి అనే వ్యక్తికి చెందిన ఓ గొర్రె మాత్రం ఏకంగా రూ.1.50 కోట్ల ధర పలికింది. అతను ఎంతో కాలం నుంచి సదరు జాతికి చెందిన ఓ గొర్రెను పెంచుతున్నాడు. దానికి సర్జా అని పేరు కూడా పెట్టాడు. అయితే ఇటీవల నిర్వహించిన ఓ సంతలో ఆ గొర్రెను అతను ప్రదర్శనకు ఉంచగా దానికి రూ.70 లక్షలు ఇస్తానని ఓ వ్యక్తి వస్తే అందుకు మెట్‌కరి నిరాకరించాడు. రూ.1.50 కోట్లు ఇస్తే గొర్రెను ఇస్తానని చెప్పాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
మడ్‌గ్యాల్ జాతికి చెందిన గొర్రెలు నిజానికి అక్కడ ఒకప్పుడు 5వేల వరకు మాత్రమే ఉండేవి. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. దీంతో వాటి సంఖ్య ఇప్పుడు ఏకంగా 1.50 లక్షలకు చేరుకుంది. ఇక ఆ గొర్రెలు చాలా పొడవుగా, పెద్దగా పెరుగుతాయి. ఇతర గొర్రెల కన్నా మాంసం ఎక్కువగా వస్తుంది. అలాగే వాటి మాంసం చాలా నాణ్యంగా కూడా ఉంటుంది. అందుకనే ఆ గొర్రెలకు అంత డిమాండ్ ఉంది. సాధారణంగా ఆ జాతికి చెందిన గొర్రెలు ఒక్కొక్కటి గరిష్టంగా రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు పలుకుతాయి. వాటి పిల్లలనే ఒక్కొక్క దాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ధరలకు విక్రయిస్తారు.
అయితే మెట్‌కరికి సర్జా అనే గొర్రె కలసి వచ్చింది. దాంతో ఎన్నో గొర్రెలను అతను పెంచాడు. అందువల్ల ఆ గొర్రె అతనికి అదృష్టం తెచ్చి పెట్టడంతో అతను దాన్ని ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఎక్కడ సంత జరిగినా దాన్ని తీసుకెళ్లి అమ్మకపోయినా సరే ఊరికే ప్రదర్శన పెడతాడు. దీంతో ఆ గొర్రెను చాలా మంది చూసేందుకు వస్తుంటారు. తన గొర్రెల పెంపకం వ్యాపారం ఆ గొర్రె వల్ల బాగా సాగుతుందని, అందువల్లే రూ.70 లక్షలకు దాన్ని అడిగినా తాను ఇవ్వలేదని, రూ.1.50 కోట్ల ధర చెప్పానని, సహజంగానే అంత భారీ మొత్తానికి ఒక గొర్రెను ఎవరూ కొనరని, కనుకనే ఆ రేటు చెప్పానని అతను తెలిపాడు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ గొర్రెలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి వాటిని అంతర్జాతీయంగా ఎగుమతి చేయాలని చూస్తోంది.