కోవిడ్ వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు భారత్ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీకి ప్రణాళికలను సిద్ధం చేశాయి. మొదటి విడతలో భాగంగా హెల్త్‌కేర్ వర్కర్లు, పోలీసులు, ఆర్మీ, హోం గార్డ్, సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ వారు, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
అయితే కరోనా రాకుండా పూర్తిగా అడ్డుకోవాలంటే రెండు డోసులు తప్పక ఇవ్వాలని ఇప్పటికే నిపుణులు తెలిపారు. ఈ క్రమంలో మొదటి డోస్ ఇచ్చాక రెండో డోస్‌కు 21 రోజుల సమయం తీసుకుంటే చాలని, తరువాత రెండో డోస్ ఇవ్వవచ్చని వారు తెలిపారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటిలాగే మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని.. వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు.
కాగా దేశవ్యాప్తంగా మొత్తం 1.54 లక్షల వాక్సినేటర్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. అయితే ఫైజర్‌కు చెందిన కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు రెండు డోసుల మధ్య గ్యాప్ 21 రోజులు కాగా, ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య గ్యాప్ 28 రోజులు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ పంపిణీకి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిసింది. వ్యాక్సిన్ పంపిణీకి గాను ఎన్నికల సిబ్బంది సహాయం కూడా తీసుకోనున్నారు.