ప్ర‌పంచ వ్యాప్తంగా ఏయే దేశాల్లో దీపావ‌ళి వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతాయో తెలుసా..?

మన దేశంలోలాగే సింగ‌పూర్‌లోనూ దీపావ‌ళిని అక్క‌డి హిందువులు ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఇక అక్క‌డ ఆ పండుగ రోజు ప‌బ్లిక్ హాలిడే కూడా ఇస్తారు.

మ‌న దేశంలో దీపావ‌ళి పండును ప్ర‌జ‌లు ఎంత ఘ‌నంగా జ‌రుపుకుంటారో అంద‌రికీ తెలిసిందే. శ్రీ‌రాముడు 14 ఏళ్ల వ‌న‌వాసం త‌రువాత తిరిగి అయోధ్య‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా, శ్రీ‌కృష్ణుడు న‌రకాసురున్ని వ‌ధించినందుకు గాను హిందువులు ఎప్ప‌టి నుంచో దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకుంటూ వ‌స్తున్నారు. అయితే కేవ‌లం మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు దేశాల్లోనూ దీపావ‌ళి పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. మ‌రి ఏయే దేశాల్లో ఈ పండుగ‌ను హిందువులు జ‌రుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. సింగ‌పూర్

మన దేశంలోలాగే సింగ‌పూర్‌లోనూ దీపావ‌ళిని అక్క‌డి హిందువులు ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఇక అక్క‌డ ఆ పండుగ రోజు ప‌బ్లిక్ హాలిడే కూడా ఇస్తారు. అక్క‌డ హిందువులు ఎక్కువ‌గా ఉన్నందునే ఈ పండుగ‌ను అక్క‌డ ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. అక్క‌డి సెంటోసా ఐల్యాండ్, క్లార్క్ క్వే, గార్డెన్స్ బై ది బే త‌దిత‌ర ప్రాంతాల్లో దీపావ‌ళి వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రుగుతాయి.

2. మారిష‌స్

మారిష‌స్ దేశంలోనూ హిందువులు ఎక్కువ‌గానే ఉంటారు. అందుక‌ని అక్క‌డ దీపావ‌ళి కూడా సంద‌డిగానే జ‌రుగుతుంది. ఇక అక్క‌డ కూడా ఆ రోజు సెల‌వు దినంగా ప్ర‌క‌టిస్తారు. అక్క‌డి బీచ్‌ల‌లో దీపావ‌ళి వేడుక‌ల‌ను వీక్షించేందుకు ఎంతో మంది భార‌తీయులు ఏటా అక్క‌డికి దీపావ‌ళి స‌మ‌యంలో వెళ్తుంటారు.

3. మ‌లేషియా

మ‌లేషియా ఇస్లాం దేశ‌మైన‌ప్ప‌టికీ అక్క‌డ హిందువులు అధికంగా ఉండ‌డం వ‌ల్ల అక్క‌డ కూడా దీపావ‌ళిని ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఆ రోజున అక్క‌డ హాలిడే ఇస్తారు. ముఖ్యంగా కౌలాలంపూర్‌లో దీపావ‌ళి వేడుక‌లు బాగా జ‌రుగుతాయి.

4. అమెరికా

అమెరికాలో భార‌తీయులు, అందులోనూ హిందువులు ఎక్కువ‌గా ఉంటారు. అందుక‌ని అక్క‌డ కూడా దీపావ‌ళి ఘ‌నంగానే నిర్వ‌హింప‌బ‌డుతుంది. ఇక అమెరికాలోనూ దీపావ‌ళికి సెల‌వు ఇస్తారు. అక్క‌డి న్యూజెర్సీ, ఇల్లినాయిస్‌, టెక్సాస్‌, కాలిఫోర్నియాల‌లో దీపావ‌ళి వేడుక‌లు సంద‌డిగా జ‌రుగుతాయి.

5. ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌ల‌లో హిందువులు ఎక్కువ‌గా ఉంటారు. అందుక‌ని ఆయా ప్రాంతాల్లో దీపావళి వేడుక‌లు అంబ‌రాన్నంటేలా జ‌రుగుతాయి. ముఖ్యంగా మెల్‌బోర్న్‌లోని ఫెడ‌రేష‌న్ స్క్వేర్‌లో దీపావ‌ళి వేడుక‌ల‌ను సంద‌డిగా నిర్వ‌హిస్తారు.