ధనత్రయోదశి రోజున బంగారమే ఎందుకు కొంటారు..?

ధన త్రయోదశి.. ఈ రోజున కొద్ది పాటి బంగారమైనా కొనాలని చెబుతుంటారు. దీపావళికి ముందు వచ్చే ఈ పండగపూట బంగారం కొనాలని ఎందుకు చెబుతుంటారు? దానికి గల కారణాలేంటి? అసలు ధన త్రయోదశి ఎందుకు జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.

 

gold-on-dhana-trayodashi

కార్తీక మాసం కృష్ణపక్షం పదమూడవ రోజున ధన త్రయోదశి జరుపుకుంటారు. అందుకే ఈ సంవత్సరం నవంబరు 13వ తేదీన జరుపుకుంటున్నారు. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీ దేవి ఈ రోజున సముద్రం నుండి బయటపడిందని చెప్పుకుంటారు. లక్ష్మీ దేవితో పాటు కుబేరుడినికూడా పూజిస్తారు. దేవుళ్ళకే అప్పులు ఇచ్చిన కుబేరుడిని ఈ రోజున పూజిస్తారు. అంతటి సిరిసంపదలు మనకూ కలగాలని పూజించడం జరుగుతుంది.

ఈ రోజున ఇల్లు మొత్తం దీపాలతో వెలిగిస్తారు. వెలుగుతున్న దీపాలతో ఇల్లంతా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వెలుగుతున్న దీపాలు మన జీవితాల్లో వెలుగులు నింపాలని, సంవత్సరాంతం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని, ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటారు.

ఇక బంగారం, వెండి కొనాలని చూడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, హిందూ సాంప్రదాయాల్లో బంగారానికి చాలా విశిష్టత ఉంది. భారతదేశంలో బంగారాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటారు. అందుకే పెళ్ళిళ్ళలో బంగారం వినియోగం ఎక్కువ. బంగారం కంటే విలువైనవి చాలా ఉండవచ్చు. కానీ బంగారానికి ఉండే మెరిసే గుణం, ఆకట్టుకే నైజం దానికి మరింత ప్రాముఖ్యతని సంతరించి పెట్టాయి. అదీగాక సముద్రంలోంచి బయటపడ్ద లక్ష్మీ తనతో పాటు బంగారు కుండతో వచ్చిందని, అందుకే రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని బంగారం కొని లక్ష్మీ దేవి ఆశీస్సులని కోరుకుంటారు.