దసరా ఉత్సవాలు చూసొద్దాం.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..

ద‌స‌రా పండుగ వ‌స్తుందంటే చాలు.. మ‌న దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. దుర్గాదేవిని భ‌క్తులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తారు.

ద‌స‌రా పండుగ వ‌స్తుందంటే చాలు.. మ‌న దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. దుర్గాదేవిని భ‌క్తులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తారు. న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. ఇక ద‌స‌రా పండుగ‌ను దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన‌ప్ప‌టికీ మ‌న దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఈ ఉత్స‌వాలు అంబ‌రాన్నంటేలా జ‌రుగుతాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతోపాటు విజ‌య‌వాడ‌, మైసూరు, కోల్‌క‌తా, ఒడిశాల‌లో విజ‌య‌ద‌శ‌మి వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రుగుతాయి. వాటి గురించిన వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ‌…

రాష్ట్రంలో ద‌స‌రా పండుగ‌ను ప్ర‌జ‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ముఖ్యంగా మ‌హిళ‌లు 9 రోజుల పాటు బ‌తుకమ్మ ఆడి దుర్గాదేవి బ‌తుక‌మ్మ రూపంలో కొలుస్తారు. బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు అయ్యాక వేడుక‌గా విజ‌య‌ద‌శ‌మిని జ‌రుపుకుంటారు. వాడ వాడ‌లా ఈ ఉత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతాయి. అనేక చోట్ల ద‌స‌రా రోజు శ‌మీ (జ‌మ్మి) వృక్షానికి పూజ‌లు చేస్తారు. పెద్ద‌ల ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే ప‌లు చోట్ల క‌న్నుల పండుగ‌గా రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు. దీంతో విజ‌య‌ద‌శ‌మి ఉత్స‌వాలు ముగుస్తాయి.

విజ‌య‌వాడ‌…

విజ‌య‌వాడ‌లో ద‌స‌రా ఉత్స‌వాల‌ను అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హిస్తారు. ఇక్క‌డి ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై కొలువై ఉన్న అమ్మ‌వారిని న‌వ‌రాత్రుల సంద‌ర్బంగా ఒక్కో రోజు ఒక్కో వేష‌ధార‌ణ‌లో అలంక‌రిస్తారు. చివ‌రి రోజు అమ్మ‌వారు దుర్గాదేవిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తుంది. విజ‌య‌ద‌శ‌మి రోజున దుర్గాదేవి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. భ‌క్తులు పెద్ద ఎత్తున అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు కొండ‌పైకి వ‌స్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. ఇక కృష్ణాన‌దిలో తెప్పోత్స‌వం ఉంటుంది. అలాగే అమ్మ‌వారి ఊరేగింపు, బేతాళ నృత్యం భ‌క్తుల‌కు వినోదాన్ని పంచుతాయి.

మైసూరు…

మైసూరు మ‌హారాజు పాల‌న కాలం నుంచి ఇక్క‌డ ద‌స‌రా ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. మ‌హారాజు కుల‌దైవం అయిన చాముండేశ్వ‌రీ దేవిని విజ‌య‌ద‌శమి రోజున పూజిస్తారు. అనంత‌రం ఏనుగుల‌పై ఊరేగిస్తారు. ఆ స‌మ‌యంలో అనేక మంది క‌ళాకారులు త‌మ విన్యాసాల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. వాటిని చూసేందుకు భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తుంటారు. ఇక మైసూరు రాజ‌భ‌వ‌నాన్ని ప్ర‌త్యేకంగా అలంక‌రిస్తారు. దాన్ని చూసేందుకు రెండు క‌ళ్లూ చాల‌వంటే న‌మ్మండి. అంత గొప్ప‌గా ఇక్క‌డ ఉత్స‌వాలు జ‌రుగుతాయి.

కోల్‌క‌తా…

కోల్‌క‌తాలో ఉన్న కాళీమాత ఆల‌యంలో విజ‌య‌ద‌శ‌మి ఉత్స‌వాలు క‌న్నుల పండుగ‌గా జ‌రుగుతాయి. దుర్గాదేవిని కాళీ మాత రూపంలో భ‌క్తులు పూజిస్తారు. కొన్ని ల‌క్ష‌ల మంది ఆ రోజు అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు వ‌స్తారు. 9 రోజుల పాటు న‌వ‌రాత్రి ఉత్స‌వాలు జ‌రుపుతారు. చివరి రోజున దుర్గామాత విగ్ర‌హాన్ని హుగ్లీ న‌దిలో నిమజ్జ‌నం చేస్తారు. ఆ స‌మ‌యంలో న‌దీ తీరంలో భ‌క్తులు పెద్ద ఎత్తున అమ్మ‌వారికి పూజ‌లు చేస్తారు.

ఒడిశా…

విజ‌య‌ద‌శ‌మి ఉత్స‌వాలు ఒడిశాలోనూ ఘ‌నంగా కొన‌సాగుతాయి. క‌ట‌క్‌కు చెందిన కళాకారులు తీర్చిదిద్దిన విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించి 9 రోజుల పాటు నవ‌రాత్రి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు. ఆ తరువాత ఆ విగ్ర‌హాలను నిమ‌జ్జ‌నం చేస్తారు. అలాగే వ‌డ్ల గింజ‌ల‌ను స్త్రీలు ల‌క్ష్మీదేవిగా భావించి పూజ‌లు చేస్తారు. దాంతో అమ్మ‌వారి అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. అలాగే న‌వ‌రాత్రుల అనంత‌రం చివ‌రి రోజు 15 అడుగుల రావ‌ణాసురుడి విగ్ర‌హాన్ని ద‌హ‌నం చేస్తారు. దాన్ని చూసేందుకు భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తుంటారు.