సొంత పార్టీకే ఏపీ బీజేపీ నేత‌ల ఎస‌రు… సోము సైలెంట్‌…!

-

అస‌లే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీకి ఆ పార్టీ నేత‌లే ఎస‌రు పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. పార్టీ అభివృద్ధి అనేది ప్ర‌స్తుతం బీజేపీకి అత్యంత అవ‌స‌రం. ఎందుకంటే.. ఆ పార్టీనే ఒక కీల‌క ల‌క్ష్యం పెట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కి.. అధికారం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికి సంబంధించిన ల‌క్ష్యాలు, అనుస‌రించిన మార్గాల‌ను కూడా ఖ‌రారు చేసుకుంది. ప్ర‌తి ఇంటిపై బీజేపీ జెండా ఎగ‌రాల‌నే ల‌క్ష్యాన్ని గ‌తంలో పార్టీ చీఫ్‌గా ఉన్న‌క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా పెట్టుకున్నారు. అయితే, ఆ దిశ‌గా ఆయ‌న అడుగులు వేయ‌లేక పోయారు. ఈ నేప‌థ్యంలో ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలాన్ని పుణికి పుచ్చుకున్న సోము వీర్రాజుకు ప‌గ్గాలు అప్ప‌గించారు.

సోము కూడా పార్టీని ముందుండి న‌డిపిస్తాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి తేవ‌డమే ల‌క్ష్యంగా ముందుకుసాగుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆదిలో కొంత దూకుడు ప్ర‌ద‌ర్శించారు. కానీ, ఇంత‌లోనే ఆయ‌న చ‌ప్ప‌బ‌డి పోయారు. ప్ర‌భుత్వంపై కానీ.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై కానీ, ఆయ‌న ఎక్క‌డా స్పందించ‌డం లేదు. దీంతో పార్టీలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇక‌, ఇదిలావుంటే, పార్టీలో కొంద‌రు చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ సంపాయించుకున్న ఇమేజ్ కాస్తా డ్యామేజీ అయిపోయింది.

జీవీఎల్ న‌ర‌సింహారావు.. జ‌గ‌న్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం.. సోము వీర్రాజు.. ఏకంగా ప్ర‌తిప‌క్షాన్ని టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. పార్టీ పుంజుకోవాలంటే.. ఇలానేనా వెళ్లేది ? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇక‌, తాజాగా విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి కూడా టీడీపీపైనే విరుచుకుప‌డ్డారు. మాకు మీరు స‌ల‌హాలు ఇవ్వొద్దు.. ముందు ఇల్లు శుభ్రం చేసుకోండి అని స‌ల‌హాలు కుమ్మ‌రించారు. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తిపై కూడా విమ‌ర్శ‌లు చేశారు. అక్క‌డ అంద‌రూ రైతులు అయితే.. ఉద్య‌మం తీరు వేరేగా ఉండేద‌ని చెప్పారు.

అంతేకాదు, కాంగ్రెస్ నాయ‌కురాలు సుంక‌ర ప‌ద్మ‌శ్రీపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు. దీంతో బీజేపీ ప‌రిస్థితి ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో పడిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజ‌కీయంగా ఏం మాట్లాడాల‌న్నా.. ఈ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌కు స‌మాధానం చెప్పిన త‌ర్వాతే.. మాట్లాడాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. పార్టీ పుంజుకునే క్ర‌మంలో ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news