సంక్రాంతి ముగ్గుల్లో ఖగోళ విశేషాలు ఉన్నాయని మీకు తెలుసా !

-

సంక్రాంతి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ముగ్గులు. సంక్రాంతికి నెలరోజుల ముందునుంచే ఆడపడుచులు, చిన్నపెద్దా అందరూ ఇంటిముందర రోజుకు ఒకరకమైన ముగ్గు వేస్తుంటారు. అయితే ఈ ముగ్గులు పలు అర్థాలను సూచిస్తాయని పెద్దలు చెప్తారు. ముగ్గులు రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం.

ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్ ఫోర్స్),చుక్కలు గతిశక్తి (డైనమిక్ ఫోర్స్)కు సంకేతాలని, మరియు ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు[2]. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూ సంకేతాలుగా చెప్పచ్చు.

రధం ముగ్గు

ఇక ధనుర్మాసం పూర్తి సందర్భంగా సమూహికంగా అందరూ వేసే ముగ్గు రథం ముగ్గు. మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.

ఇలా ఒకరికొకరు స్నేహం, అనురాగం కలుపుకొంటూ ఒకరికొకరూ అనే సమైక్య భావనతో ఒకరి ముగ్గు చివరిని పక్కింటికి ఇలా అందరూ ఆనందంతో రథం ముగ్గుతో పండుగకు ముగింపు పలుకుతారు. మళ్లీ వచ్చే ఏడాది వరకు ఆ ఆనందాలను, ప్రేమను కొనసాగించుకుంటూ ముందుకు పోతారు. ఇలా ప్రేమ,ఆప్యాయత, సమైక్యతే కాకుండా పోటీ తత్వం, విభిన్న ఆలోచనలు, నిపుణతల కలయిక ఈ ముగ్గుల వెనుక ఆంతర్యం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news