మహా శివరాత్రి నాడు నిజంగా చేయాల్సింది ఇదే !

-

శివ.. అంటే శుభం. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుడి అనుగ్రహం పొందడానికి మనం విశిష్టమైన రోజు మహా శివరాత్రి.. సృష్టిలో లింగస్వరూపం జ్యోతిస్పాటిక రూపంలో ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి. అన్ని పండుగలకు రకరకాల నైవేద్యాలు, వంటలు చేస్తారు కానీ ఈ మహాశివరాత్రికి మాత్రం కటిక ఉపవాసంతో పండుగను చేసుకుంటారు. మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. లింగోద్భవం జరిగిన రోజే మహాశిరాత్రిగా జరుపుకుంటారు. శివుడి పండుగల్లో ఇది ప్రధానమైంది. ప్రతినెల శివరాత్రి వస్తుంది కానీ మహా శివరాత్రి మాత్రం ఏడాదిలో ఒక్కసారి వస్తుంది.

ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడు అవుతాడని పురాణాల ఉవాచ. మహాశివరాత్రి రోజున శివ ప్రతిష్ట చేసినా, శివపార్వతుల కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతను అర్థంచేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒక్కపూట భోజనం చేసి, చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. ఇక సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందని పండితులు పేర్కొంటున్నారు.

ఎంతో పవిత్రమైన ఈ రోజున శివుణ్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శివపురాణంలో శివరాత్రి పూజ విధానాన్ని శ్రీకృష్ణుడుకి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఈ రోజున పరమేశ్వరుణ్ని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు. అవి.. శివపూజ, ఉపవాసం, జాగారం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రినాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైంది మరొకటి లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి.

ఉపవాసం అంటేఉపేన వాసం అంటే దేవుడికి దగ్గరగా మనసును ఉంచడం. ప్రతిక్షణం మనసులో భగవత్ ఆరాధన చేయడం. ఆదిదేవుడికి దగ్గరగా మనసును ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది. శంకరుని అనుగ్రహం లభిస్తుంది. శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలి అంటే శారీరక సంతృప్తి అంటే ఆహారాదులకు వెంపట్లరాకుండా శుద్ధమైన శరీరం, మనస్సు కలిగి ఉండాలి. ఈరోజు ఉపవాసంతో కూడిన ధ్యానం, ఆరాధన, పారాయణం, జపం, తపం, దానం, ధర్మం చేయాలి. అయితే శాస్త్రం ప్రకారం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాడు. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్దులు, 10 ఏండ్ల లోపు పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో కఠిన ఉపవాసం చేయకూడదు. అల్పాహారం అంటే పండ్లు, పాలు, తీసుకోవచ్చు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ, పుచ్చకాయ, తదితర పండ్లను తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news