శివరాత్రి రోజున శివుడ్ని బిల్వపత్రాలతో పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా !

-

శివారాధన అత్యంత సులభం. అత్యంత శుభప్రదం. ఆయనకు కాసిన్ని నీళ్లు, నాలుగు దళాలు చాలు అంటుంది పురాణాలు. శ్రీఘ్రంగా భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తాడు ఆ మహాదేవుడు. అయితే శివరాత్రినాడు బిల్వదళాలతో ఆ దేవదేవుడి అర్చన చేస్తే ఏం ఫలితం వస్తుందో పురాణగాథలో చెప్పిన విశేషాలను తెలుసుకుందాం….

మహాశివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకం చేయాలి. ”నమశ్శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. బిల్వపత్రాలతో శివలింగాన్ని పూజించాలి. మృత్యుంజయ మంత్రం జపించాలి. ఈ శివరాత్రి వ్రతాన్ని కనీసం ఒక్కసారి చేసినా ఇహలోకంలో సర్వ సుఖాలూ, పరలోకంలో మోక్ష ప్రాప్తి లభిస్తాయి. అందుకు నిదర్శనమైన కథ తెలుసుకుందాం…

maredu dalam is used in the worship of shivaratri
maredu dalam is used in the worship of shivaratri

పూర్వం ఒక వేటగాడు ఉండేవాడు. అతను రోజూ అడవికి వెళ్ళి జంతువులను వేటాడి జీవించేవారు. ఒకరోజు వేటగాడికి ఏ మృగమూ దొరకలేదు. రాత్రయినా చిన్న జంతువు కూడా దొరకలేదు. నిరాశ కలిగినా ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళలేక ఒక సరసు వద్ద ఉన్న చెట్టు ఎక్కి ఏదో ఒక జంతువు నీళ్ళు తాగడానికి రాకపోతుందా అని మాటు వేశాడు.తాను కూర్చోడానికి వీలుగా ఆ చెట్టు ఆకులు, పూలు, కాయలు విరిచి కింద పడేశాడు. అనుకున్నట్లుగానే ఒక జాము వేళ ఓ లేడి వచ్చింది. వేటగాడు ఆనందించి జింకకు బాణం వేయబోగా జింక పైకి చూసి ”వేటగాడా.. నన్ను చంపకు” అంది. జింక మనిషిలా మాట్లాడుతోంది ఏమిటని ఆశ్చర్యపోయి చూశాడు. అందుకు సమాధానంగా ”నేను గతజన్మలో రంభని. అప్సరసనైన నేను రాక్షస రాజు అయిన హిరణ్యాక్షుని మోహంలో పడి మహాశివుని పూజించడం మరచాను. అందుకు కోపించిన పరమేశ్వరుడు ”కామంతో కళ్ళు మూసుకుపోయిన నువ్వు, నీ ప్రేమికుడు కూడా జింకలుగా పన్నెండేళ్ళు జీవించండి. చివరికి ఒక వేటగాడి కారణంగా శాపవిముక్తులౌతారు” అంటూ శపించాడు. ”ఇప్పుడు నేను నిండు గర్భిణిని. ఈ స్థితిలో నన్ను చంపకూడదు. నేను ప్రసవం కాగానే, శిశువును ఎవరికైనా అప్పగించి వస్తాను. ఈలోపు ఒక పెంటిజింక వస్తుంది.. దాన్ని చంపు” అని చెప్పింది.

వేటగాడు అమితాశ్చర్యంతో అదంతా విని అందుకు సరేనన్నాడు. రెండో జాము వేళ పెంటి జింక వచ్చింది. వేటగాడు దాన్ని చంపబోగా అది కూడా మనిషి స్వరంతో ”వేటగాడా.. నేను విరహంతో వేగిపోయి ఉన్నాను. నా శరీరం కూడా కుంగి కృశించి పోయింది. నన్ను చంపినా, దోసెడు మాంసం కూడా రాదు. కనుక నువ్వు చేసేది దండగమారి పని. కాసేపట్లో బలమైన జింక వస్తుంది, దాన్ని చంపు.. లేదంటే కొద్దిసేపట్లో నేను తిరిగివస్తాను, అప్పుడు చంపుడువుగాని” అంది. వేటగాడు అలాగే విడిచిపెట్టాడు. మరికాసేపటికి మగ జింక వచ్చింది. వేటగాడు బాణం తీయగా ఆ జింక ”ఇంతకుముందు నా ప్రేయసిని, మరో జింకను చంపింది నువ్వేనా?” అనడిగింది. వేటగాడు ఆశ్చర్యపోయి ”లేదు.. అవి తిరిగివస్తామని చెప్పి వెళ్ళాయి.. నిన్ను చంపి భుజించమని చెప్పాయి” అన్నాడు. ఆ జింక ”అలాగా.. సరే.. ఇప్పుడు మాత్రం నన్ను వదిలిపెట్టు. నా భార్య నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తనతో గడిపి, బంధుమిత్రులతో చెప్పి తిరిగివస్తాను.. నన్ను నమ్ము” అంది.

వేటగాడు దాన్ని కూడా వదిలాడు. అతనికి అంతా చాలా వింతగా ఉంది. వాటికోసం ఎదురుచూస్తూ ఆ చెట్టుమీదే ఉండిపోయాడు. అతని నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ జింకలు తిరిగి వచ్చాయి. ఇంకా చిత్రం ఏమిటంటే ఆ జింకలు దేనికదే తనని చంపమంటే తనని చంపమని వేటగాణ్ణి బ్రతిమాలాయి. వాటి నిజాయితీ చూసిన క్షణాన వేటగాడిలో ఊహించని మార్పు వచ్చింది. తాను చేస్తున్నది నీచమైన పని అనిపించింది. తనమీద తనకే జుగుప్స కలిగింది. ”నేను చంపను.. దయ, ధర్మం అంటే ఏమిటో నాకు తెలిసొచ్చింది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో మరెప్పుడూ నేను ఎవర్నీ చంపను.. మీరంతా సుఖంగా జీవించండి..” అనడమే కాకుండా, తన కళ్ళు తెరిపించిన ఆ జింకలకు నమస్కరించాడు. అప్పుడు దేవతలు పూలవర్షం కురిపించారు. ఆకాశం నుండి సుస్వరాలు వినిపించాయి. దేవదూతల విమానం వచ్చి ఆగింది. వారు ”ఓ వేటగాడా.. ఈరోజు మహాశివరాత్రి. ఆహారం దొరక్క అయితేనేం ఈరోజు ఉపవాసం ఉన్నావు. రాత్రంతా జాగారం చేశావు. అనుకోకుండా నువ్వు ఎక్కిన చెట్టు మరేదో కాదు బిల్వవృక్షం. ముఖానికి అడ్డు వస్తున్నాయని ఆకులను తుంచి కింద వేసావు. చెట్టు మొదట్లో స్వయంభూలింగం ఉంది. నువ్వు వేసిన ఆకులు లింగంపై పడ్డాయి. శివునికి బిల్వపత్రాల పూజ కంటే ప్రియమైంది లేదు. అన్నిటినీ మించి నువ్వు చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందావు. అవకాశం వచ్చినా మృగాలను చంపలేదు. నిన్ను సశరీరంగా స్వర్గానికి తీసికెళ్ళేందుకే వచ్చాం..” అన్నారు.

అలా వేటగాని జీవితం ధన్యమైంది. తెలియకపోయినా శివునికి ఇష్టమైన విధులతో స్వర్గప్రాప్తి పొందాడు. కనుక మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వపత్రాలతో శివలింగాన్ని పూజించడం శ్రేష్ఠం. ఈ పండుగనాడు రోజంతా ఉపవాసం ఉండి, శివుని ధ్యానిస్తూ, అర్చిస్తూ గడిపి, రాత్రి జాగరణ చేయాలి. అది సర్వ సుఖాలనూ ఇచ్చి, స్వర్గ లోకాలకు దారితీస్తుంది. ఇహలోక సుఖాలతోపాటు పరలోక మోక్షాన్ని ప్రసాదించే పర్వదినం శివరాత్రి. అజ్ఞాన తిమిరాన్ని చీల్చి విశ్వమంతా జ్యోతిగా మహాదేవుడు ఆవిర్భవించిన ఘడియ ఇది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news