చేదుగా ఉందని పక్కనపెట్టే కాకరకాయలో ఎన్ని ప్రయోజనాలున్నాయో..

ఇంట్లో కాకరకాయ కూర వండగానే ఆరోజెందుకో చాలామంది సరిగ్గా భోజనం చేయరు. కాకరకాయ చేదు అని తినడానికి ఇష్టపడరు. కానీ ఆ చేదులోనే ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. ఎవరో చెప్పినట్టు నోటికి రుచిగా ఉండని ఆహారపదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయట. కాకరకాయ అలాంటిదే. నిజానికి కాకరకాయ కూరగాయ కాదు. అది ఒక ఫలం. కాకర తీగకి కాసే ఫలాన్ని మనం వండుకుని తింటాం.

కాకరకాయతో చేసే ఆహారపదార్థాల్లో కాకర కాయ జ్యూస్ చాలా మంచిది. కాకర లో ఉండే ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, పొటాషియం శరీరానికి చేరి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. కాకర జ్యూస్ తాగాలనుకునే వారు చేదుగా ఉంటుందని పక్కన పెట్టి ఆరోగ్య ప్రయోజనాలని పొందలేకపోతారు. వారికోసం కాకర్ జ్యూస్ లో కొంత బెల్లం వేసుకుని రుచి కలిగించవచ్చు. కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

కాకర కాయ వల్ల ప్రయోజనాలు:

రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలోకి తీసుకువస్తుంది. ప్రపంచంలో చక్కెర వ్యాధితో బాధపడుతున్నవారు రోజు రోజుకీ పెరుగుతున్నారు. కాకరలో ఉండే పాలిపెప్టైడ్ పి అనేది ఇన్సులిన్ గా పనిచేసి, రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తుంది. దీనిలో ఉండే ఫోలిక్ ఆమ్లం హృదయ రోగాలు రాకుండా కాపాడుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రపరిచి కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. మూత్రాశయ సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది.

ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి దీనికి చాలా చక్కగా పనిచేస్తాయి. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం పాడవకుండా ఉండేలా చేసి ముడుతలు రాకుండా కాపాడుతుంది.