హైదరాబాదీ మటన్ మసాలా త‌యారీ విధానం

-

హైదరాబాద్ అంటే చికెన్ బిర్యానీ.. చికెన్ బిర్యానీ అంటే హైదరాబాద్. అంతేనా.. ఇంకేం లేదా. ఉంది. హైదరాబాద్ లో ఒక చికెన్ బిర్యానీ మాత్రమే కాదు.. ఇంకా చాలా వంటకాలు ఫేమస్సు. అందులో హైదరాబాద్ మటన్ మసాలా ఒకటి. రోటీల్లో ముంచుకొని తింటే ఉంటది నా సామిరంగా. ఆహా.. ఆ అనుభూతే వేరు. మరి.. టేస్టీ టేస్టీ హైదరాబాద్ మటన్ మసాలా ఎలా చేయాలో తెలుసుకుందామా…

దాని కోసం ఓ అర కిలో మటన్, రెండు ఉల్లిగడ్డలు, తగినంత నూనె, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, దనియాల పొడి, జిలకర్ర పొడి, కొత్తిమీర, ఓ రెండు టమాటాలు, కప్పు పెరుగు, మటన్ మసాలా, గరం మసాలా ఉంటే చాలు.. హైదరాబాద్ మటన్ మసాలాను ఏం చక్కా వండేసుకోవచ్చు.

ఈ వంటకాన్ని వండటం పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా మటన్ లో కొంచెం నూనె పోసి ఉప్పు వేసి ఓ పది నిమిషాల పాటు అలా ఉడికించండి. అయిందా.. తర్వాత పాన్ తీసుకోండి. ఇంత నూనె పోయండి. చిన్నగా తరిమిన ఉల్లిగడ్డ ముక్కలు వేయండి. దోరగా వేయించండి. తర్వాత వాటిలో ఇదివరకు ఉడికించిన మటన్ ముక్కలను వేయండి. కాసేపు అలా ఉడకనీయండి. తర్వాత కాసింత ఉప్పు, పసుపు, కారం, దనియాలపొడి, మటన్ మసాలా పొడి, జీలకర్ర పొడి వేసి ఉడికించండి. కాసేపు ఉడికాక.. సన్నగా తరిమిన టమాటా ముక్కలను వేయండి. అవి కూడా ఉడికాక.. కాసింత పెరుగు వేయండి అందులో. అయిందా.. అది ఉడుకుతుండగానే మీ ఇంటిని ఘుమఘుమలు అలుముకుంటాయి. అంటే కూర వండటం దగ్గర పడిందని అర్థం. కాసేపటి తర్వత కొన్ని నీళ్లు పోయండి. తర్వాత సన్నగా తురిమిన కొత్తిమీర వేసి సిమ్ లో పెట్టండి. ముక్కలు ఉడికేదాకా కూరను ఉడకనివ్వండి. అయిందా.. ఆ తర్వాత గరం మసాలా, మరికొంచెం కొత్తిమీర వేసి దించేయండి. అంతే.. ఘుమఘుమలాడే హైదరాబాద్ మటన్ మసాలా రెడీ. దాన్ని వేడి వేడి అన్నంలో గానీ.. చపాతీలతో గానీ తింటే ఉంటది… నోరూరుతుందా. వెంటనే మీ ఇంట్లో ఈ వంటకం ట్రై చేయండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news