వేసవిలో సహజంగానే ఐస్‌క్రీములను ఎవరైనా తింటారు. కానీ వెరైటీగా కుల్ఫీలను తినేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నిజానికి కుల్ఫీలు కూడా ఐస్‌క్రీములలాగే ఉంటాయి. కానీ టేస్ట్ వేరేలా ఉంటుంది. అయితే వీటిని తినేందుకు ఎక్కడికో బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే కుల్ఫీలను చేసుకోవచ్చు. మరి పిస్తాలతో కుల్ఫీలను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
పిస్తా కుల్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు:
పాలు – 1 లీటర్
చక్కెర – 250 గ్రాములు
బ్రెడ్ – ఒక ముక్క (చివర్లు కత్తిరించుకోవాలి)
బాదంపప్పు – 20 (నీటిలో నానబెట్టి పొట్టు తీసినవి)
పిస్తాపప్పు – అర కప్పు (పొట్టు తీసినవి, పలుకులుగా చేయాలి)
యాలకులు – 4
కుంకుమ పువ్వు – 2, 3 రెబ్బలు
పిస్తా కుల్ఫీ తయారు చేసే విధానం:
లీటర్ పాలను అర లీటర్ అయ్యే వరకు మరిగించాలి. పాలు చల్లారాక అందులో చక్కెర, బ్రెడ్, బాదం పప్పు పొడి, పిస్తాపప్పు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. కుల్ఫీ మౌల్డ్‌లో సిల్వర్ ఫాయిల్ సెట్ చేయాలి. అందులో ముందుగా కలుపుకున్న మిశ్రమం పోయాలి. ఐస్‌క్రీం పుల్లను పెట్టుకోవాలి. 12 గంటల పాటు కుల్ఫీ మౌల్డ్‌ని డీప్ ప్రిజ్‌లో ఉంచాలి. అంతే.. చల్ల చల్లని పిస్తా కుల్ఫీ తయారవుతుంది. కుల్ఫీ మౌల్డ్స్‌ను వేడి నీటిలో ముంచితే కుల్ఫీలు సులభంగా బయటకు వస్తాయి. వాటిని చల్ల చల్లగా ఉన్నప్పుడే తినాలి. అయితే కుల్ఫీ మౌల్డ్స్ ఇంట్లో లేకపోతే చిన్న చిన్న గ్లాసులలో ఆ మిశ్రమం పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.