ట్విటర్‌ సీఈఓ భోజనం గురించి వింటే మీరు ఆవాక్కవడం ఖాయం..!

-

ట్విటర్‌, స్క్వేర్‌ సీఈఓ జాక్‌ డార్సీ, భారత పురాతన భోజన నియమాలను బాగా ఒంటబట్టించుకున్నాడు. ఆయన ఆహార నియమాలు చూస్తే మీరు నోరెళ్లబెట్టడం తథ్యం.

జాక్‌ డార్సీ – ప్రఖ్యాత సోషల్‌ మీడియం ట్విటర్‌కు సీఈఓ. ఈయనకు స్క్వేర్‌ అనబడే ఆర్థిక సేవల సంస్థ కూడా ఉంది. అమెరికాలో పుట్టి పెరిగిన జాక్‌, స్వతహాగా కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌. న్యూయార్క్‌ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఆయనకు ఈ ట్విటర్‌ ఐడియా తట్టింది. తను మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ట్విటర్‌ను నెలకొల్పాడు. నాటి నుండి నేటి వరకు జాక్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన ఆస్థుల విలువ నేటికి దాదాపు 500 కోట్ల డాలర్లకు పైగా ఉంది. యోగా, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే బాగా పిచ్చి. అన్నట్టు దాతృత్వంలో కూడా ముందుంటాడు.

ఈమధ్య ప్రముఖ టివి చానెల్‌, సిఎన్‌బిసి కి ఇంటర్వ్యూ ఇచ్చిన జాక్‌, తన అలవాట్లు, ఆహారం గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. చాలా వరకు ఇతరులు ఆచరించదగ్గవే ఉన్నాయి కానీ, ఆహార నియమాలే ఎవరికీ అంతగా మింగుడుపడటం లేదు.

ఆయన అలవాట్లలో ప్రముఖమైనవి, ధ్యానం, ఆవిరి స్నానం, డెస్క్‌ దగ్గర నిలబడే పనిచేయడం, మ్యాగజైన్లు, వార్తాపత్రికలు చదవడం. వీటిలో ఒకటి రెండు కాస్తా కష్టమైనా ఔత్సాహికులు ప్రయత్నించవచ్చు. అయితే మన భారత నీతి సూక్తి అయిన ‘‘ ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహభోగి, త్రిభుక్తం మహారోగి’’ ని తు చ తప్పకుండా పాటిస్తున్నాడు. భారతీయులైతే దీన్ని ఎప్పుడే అటకెక్కించేసారు. కానీ జాక్‌ మాత్రం అందులోనే ఆరోగ్యముందని ఘంటాపథంగా చెబుతున్నాడు.

జాక్‌ డార్సీ, సాధారణ పనిదినాలలో, రోజుకు ఒక్కసారే భోజనం చేస్తాడట. అది కూడా కొద్ది పరిమాణాలలో, చేపలు, మాంసం, చికెన్‌, పాలకూర, తోటకూర లేదా మొలకలు. తర్వాత అన్న రకాల బెర్రీలు కలసిన ఓ స్వీటు లేదా కొంచెం డార్క్‌ చాకొలేట్‌,, ఓ గ్లాసు రెడ్‌ వైన్‌… ఇదీ ఆయన రోజువారీ ఆహారం. సరే…వారానికి అయిదు రోజులు ఇలా తిని, మిగిలిన రెండు రెండు రోజులు కుమ్మేస్తాడేమోనని అనుకోకండి. అది నాలుగు రోజులే. శుక్ర, శని, ఆదివారాలు పూర్తిగా ‘ఉపవాసమే’. అస్సలు ఏమీ తినడట. ఆదివారం రాత్రికే మళ్లీ పైన చెప్పిన భోజనం చేస్తాడట. షాకింగ్‌గా ఉంది కదూ.. ఈయన ఎలా బతికుంటున్నాడనే సందేహం వస్తే, మీ తప్పేమీ లేదు.

‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ లెక్కేసినదాని ప్రకారం, జాక్‌ ప్రతి భోజనం ఇచ్చే శక్తి దాదాపు 1000 కెలొరీలు మాత్రమే. దాంతో ఎలా జీవనం ఎలా గడుపుతున్నాడనేది చాలామందికి ఉన్న సందేహమే అయినా, అది ఆయన జీవనశైలికి, శరీరానికి సూటయిందనేది డాక్టర్ల వాదన. సాధారణంగా ఇలా మధ్యంతర ఉపవాసాలు మంచివేనని భారత ఆయుర్వేదం చెప్పినా, శాస్త్రపరంగా ఇంకా రుజువు కాలేదని పరిశోధకుల అభిప్రాయం.

ఏదేమైనా, జాక్‌ డార్సీ పాటిస్తున్న ఆహార నియమాలు అందరికీ పడవనీ, కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్‌ అని డాక్టర్ల సలహా. మీరు కూడా అనవసర ప్రయెగాలేవీ చేయకండి. కాకపోతే గురువారాలు, శనివారాలు కాస్తా గట్టిగా చేయండి చాలు.

Read more RELATED
Recommended to you

Latest news