సెకండ్ వేవ్ కారణంగా యాంగ్జాయిటీకి గురవుతున్నారా? ఐతే ఈ టిప్స్ మీకోసమే..

మహమ్మారి పోయింది. అంతా మామూలుగా అయిపోయిందనుకున్న సమయంలో సడెన్ గా సెకండ్ వేవ్ అంటూ వచ్చి అప్పటి వరకూ ఉన్న మామూలు రోజులని పట్టుకెళ్ళింది. దాంతో ప్రతీ ఒక్కరిలో యాంగ్జాయిటో చోటు చేసుకుంది. సెకండ్ వేవ్ వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటే మీరొంటరి కాదు. ఇలా ఫీల్ అవుతున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐతే ఒత్తిడి, యాంగ్జాయిటి ఎంతమాత్రమూ మంచిది కాదు. కాబట్టి దీన్నుండి బయటపడడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం.

ముందుగా పొద్దున్న లేవగానే మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి

మీకున్న కొన్ని ముఖ్యమైన అలవాట్లను గుర్తు చేసుకుని మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీ గురించి బయటకు చెప్పుకోండి. మొదట్లో కొంచెం అదోలా అనిపించినా అలా మీ గురించి మీరు చెప్పుకోవడం మీకు సరికొత్త హుషారుని ఇస్తుంది. మళ్లీ మామూలు అవుతుందన్న నమ్మకాన్ని ఉంచుకోండి. మామూలు దినచర్య పోయిందని బాధపడవద్దు. ఇంటివద్ద ఉంటునే మామూలుగా ఉండడానికి ప్రయత్నించండి. హాబీని మరింత పెంచుకోండి, కొత్త పదాలు నేర్చుకోండి. ఆ పదాలను రోజువారి జీవితంలో ఉపయోగించండి. రోజులో ఒక పూట మీరే వంట చేయండి. అస్సలు ఖాళీగా ఉండవద్దు.

మనుషులని కలుసుకోండి

యాంగ్జాయిటీ ఎక్కువవుతుందని మీకు అనిపిస్తే ఒంటరిగా ఉండకండి. ప్రస్తుతం ఇతరులని కలిసే పరిస్థితి లేదని తెలుసు. కాబట్టి ఫోన్లో మాట్లాడండి. వారు మీ చేతికి అందే ఫోన్ అంత దూరంలో మాత్రమే ఉన్నారని గుర్తుంచుకోండి. మీ మనసులోని భావాలను వారితో పంచుకోండి. అన్ని నింపుకుని మనసును బరువుగా చేసుకోకుండా మీ స్నేహితులతో చెప్పుకుని బరువు దించేసుకోండి.

ఒప్పుకోండి

యాంగ్జాయిటీ తగ్గడానికి ప్రధానమైనది ఒప్పుకోలు. ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు, అది మీకు తెలుసు. దాన్ని ఒప్పుకోండి. అలా అని మళ్ళీ మామూలు రోజులు వస్తాయని నమ్మండి.