ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తుంటారు. వ్యాయామం, ఆహారపు అలవాట్లపై శ్రద్ధ చూపకపోవడంతో అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఫలితంగా ఊబకాయం, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, ఉదర సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇలా వ్యాధులతో బాధపడేవాళ్లు ఇంట్లో చేసుకునే ఒక చిన్న చిట్కా వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పరిగడపున వేడి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలోని మలినాలను బయటకు పంపించడమే కాకుండా అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది.
ప్రతి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. నిద్రలేచిన తర్వాత 2-3 గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందుకే వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రయోజనాలు..
పరిగడపున వేడి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. కడుపు నొప్పి, అజీర్తి, జీర్ణ సమస్య, ఉదర సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి సమస్యలు దరిచేరవు. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు మూత్ర సంబంధిత వ్యాధులు (యూరిన్ పసుపు రంగులో వచ్చేవారు) ఉన్నవారు తప్పనిసరిగా గోరు వెచ్చని నీళ్లు తాగితే 3-4 రోజుల్లోనే ఫలితం మీకు కనిపిస్తుంది.
ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధ పడుతున్న వారు తరచూ వేడి నీళ్లు తీసుకోవాలి. దీంతో శరీరంలో మెటబాలిజంను పెంచి మలినాలు, వ్యర్థాలను బయటకు పంపించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అందుకే ఊబకాయంతో బాధపడేవారు రోజూ గోరువెచ్చని నీళ్లు 2-3 గ్లాసులు తీసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి నీరు తాగడం వల్ల కొవ్వు అలాగే పేరుకుపోతుంటుందని, దాహం తీరుతుంది తప్ప.. ఎలాంటి ఉపయోగం ఉండదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
జలుబు, దగ్గు, పడిశం, న్యూమోనియా వంటి వ్యాధులతో బాధపడేవాళ్లు గోరు వెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగాలి. ఎందుకంటే గొంతు సమస్య తలెత్తినప్పుడు ఆరోగ్య సమస్యలు పెరిగే ఆస్కారం ఉంటుంది. వేడి నీళ్లు తాగడం వల్ల గొంతులో ఉండే బ్యాక్టీరియాలు చనిపోతాయి. డిహైడ్రేషన్‌తో బాధపడేవారు.. వేడినీటిలో నిమ్మరసం, తేనె, కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచింది. మహిళలు ప్రతిరోజు ఉదయాన్నే ఇలా చేస్తే మెటబాలిజం పెంచడంతోపాటు అధిక బరువును నియంత్రణలో ఉంచుతుంది.