దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కరోనా ప్రభావం ఎక్కువ ఉంటుందన్న విషయం ఇప్పటికే చాలా అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఊబకాయులపై కరోనా అధిక ప్రభావం చూపుతోంది. అయితే తాజాగా కూడా ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం దీనికి సంబంధించి మరో విషయాన్ని వెల్లడించింది.
ఊబకాయులకు కరోనా సోకితే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 23 దాటిన వారు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తుందని తెలిపారు. బీఎంఐ 23 దాటిన వారు ఎక్కువగా ఐసీయూల్లో చేరుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడయింది. బీఎంఐ ఒక్క పాయింటు పెరిగినా… ఆసుపత్రుల్లో చేరే అవకాశం 5 శాతం, ఐసీయూలో చేరే అవకాశాలు 10 శాతం పెరుగుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సున్న ఊబకాయులు ఈ ముప్పును అధికంగా ఎదుర్కొంటున్నారని పరిశోధన తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో కూడా తొలి ప్రాధాన్యత కూడా వీరికే ఇవ్వాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
కాగా కరోనా నేపథ్యంలో గతేడాది కాలంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఎక్కువ శాతం ఇళ్లలోనే ఉండడం వల్ల బరువు కూడా పెరుగుతున్నారు. అయితే ఇళ్లలోనే ఉండి తగిన వ్యాయామాలు చేసి బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం యువతపై ఎక్కువగా ఉంది. తమకు వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉందని కొంత మంది యువత నిర్లక్ష్యం చేయడం వల్ల కరోనా యువతలో వేగంగా వ్యాప్తి చెందుతుంది.