అది ఏ కూరయినా… కరివేపాకు ఉండాల్సిందే. కరివేపాకు లేని కిచెన్ ఉండదు. కూరకు రుచి, సువాసనను ఇస్తుంది కరివేపాకు. రుచి, సువాసనతో పాటు కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొంతమంది కరివేపాకును కూరల్లో వేస్తారు.. కానీ తినేటప్పుడు కరివేపాకును తినరు. దాన్ని పక్కన బెడతారు. అటువంటి వాళ్లు కరివేపాకు వల్ల వచ్చే ఎన్నో ప్రయోజనాలను పొందరు. అదంతా సరే గాని.. ముందు కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెప్పవయ్యా అంటారా? పదండి తెలుసుకుందాం.
రోజూ నాలుగు కరివేపాకు ఆకులను నమిలి మింగండి. అంతే.. మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో అది శరీరంలోని చెడు కొలెస్టరాల్ ను తగ్గించడంతో పాటు బరువును తగ్గించుకోవచ్చు.
డయాబెటిస్ తో బాధపడేవారు కరివేపాకును తప్పకుండా తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి కరివేపాకు ఎంతో సాయపడుతుంది. రోజు నాలుగు ఆకులను నమిలి మింగడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది.
కరివేపాకులో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. కంటి చూపు మెరుగవడంతో పాటు రేచీకటి సమస్యలు కూడా దూరమవుతాయి.
చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో వెంట్రుకలు రాలడం ఒకటి. చిన్న వయసులోనే జుట్టు రాలడం, తెల్లబడటం, పలుచబడటం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు కరివేపాకు రోజూ తింటే మంచిది.
మూత్ర సంబంధ సమస్యలను తరిమికొట్టడానికి, రక్తహీనత నుంచి కాపాడుకోవడానికి, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించుకోవడానికి, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి కూడా కరివేపాకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.
చర్మ సౌందర్యం కోసం కూడా కరివేపాకును ఉపయోగించవచ్చు. చర్మంపై ఏర్పడే ముడతలు, చర్మపు ఇన్ఫెక్షన్లను నివారించడంలో కరివేపాకు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచడానికి కరివేపాకు దోహదపడుతుంది.