రోజుకు ఎన్ని అడుగులు వేయాలి.. వారానికి ఎన్ని నిమిషాలు నడవాలో తెలుసా..!

-

మంచి ఆరోగ్యానికి డైలీ నడక ప్రాధాన్యం అని వైద్యులు అంటారు. రోజు వాకింగ్ చేయటం అలవాటుగా చేసుకుంటే..ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావంటారు. నడక అనేది నిరాడంబరమైన వ్యాయామం. నడక లేదా పరుగెత్తడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఈ క్రమంలోనే మీరు తెలుసుకోవాలి.. అసలు వ్యాయామంలో నడక పాత్ర ఏంటి? ఒక రోజులో ఎన్ని అడుగులు వేస్తే వ్యాయామం పూర్తవుతుంది? నడిచే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు..ఇవి మీకు తెలిసి ఉండాలి కదా.!

నడక ప్రయోజనాలు

నడక వలన వ్యక్తుల శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
గుండె వ్యాధులు, స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్త పోటు, డిప్రెషన్.. వంటి అనారోగ్యాలను నడక దూరం చేస్తుంది.
నడక వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 31 శాతం వరకు తగ్గుతుది
సీవీడీ సమస్యలతో మరణాల ప్రమాదం 32 శాతం తగ్గుతుందట.
పగటిపూట ఎక్కువగా కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది

అయితే రోజులో ఎంత సమయం నడవాలి?

నడక అనేది.. తీవ్రత మధ్యస్థంగా ఉండే వ్యాయామం కిందకు వస్తుంది. వారానికి కనీసం 150 నిమిషాలు చురుకైన నడక వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.. అలాగని ఈ 150 నిమిషాల పాటు అతిగా కష్టపడాల్సిన అవసరం లేదు. సాధారణ నడకతో ప్రారంభించి, క్రమంగా సమయాన్ని, తీవ్రతను పెంచుకుంటూ పోవాలి.. ఒక వ్యక్తి వారానికి ఐదు రోజుల పాటు.. ప్రతిరోజు 30 నిమిషాలు లేదా ఖాళీ సమయాల్లో 10 నిమిషాల చొప్పున ఇలాంటి వ్యాయామం చేయాలని మయో క్లినిక్ నిపుణులు అంటున్నారు. అయితే సాధారణ వ్యక్తులు ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల నడక ద్వారా మంచి వ్యాయామ ఫలితాలను పొందవచ్చు.

ఎన్ని అడుగులు నడవాలి?

ఆరోగ్యకరమైన వ్యక్తులు గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడుస్తూ.. రోజుకు రెండు నుంచి నాలుగు మైళ్ల దూరం నడవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. సగటున 2,000 అడుగుల నడకను ఒక మైలుగా లెక్కించాలి.. ఈ దూరాన్ని ట్రాక్ చేసే పెడోమీటర్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు ఇప్పుడు ఉన్న స్మార్ట్ ఫోన్లలోనూ మనం నడిచే అడుగుల సంఖ్య చూపిస్తుంది. వారానికి కేవలం ఐదున్నర మైళ్ల దూరం నడిచేవారు.. అదికూడా గంటకు రెండు మైళ్ల వేగంతో నడిచేవారు కూడా అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని అధ్యయనాల్లో తేలింది.

కొంతమంది మాత్రం రోజుకు 10,000 అగుడులను లక్ష్యంగా పెట్టుకుంటారు. సాధారణంగా ఎక్కువ వేగంతో, ఎక్కువ దూరం నడిచేవారికి మంచి వ్యాయామ ఫలితాలు అందుతాయి. వీరికి సీవీడీ, ఇతర అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది. అందువల్ల 10,000 అడుగుల లక్ష్యం సమంజసమే. అయితే ఇతర అనారోగ్యాలు లేనివారు, అది కూడా వైద్యుల సలహాతో మాత్రమే ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలట.

ఎంత వేగంగా నడవాలి?

నిమిషానికి 80 అడుగుల నడకను సాధారణ వేగంగా.. నిమిషానికి 100 అడుగులను మధ్యస్థం నుంచి చురుకైన వేగంగా పరిగణించాల్సి ఉంటుంది..నిమిషానికి 120 అడుగులను ఎక్కువ వేగంగా గుర్తించవచ్చు.అలా అని మీరు ప్రతిసారి నడిచేప్పుడు ఈ లెక్కలన్నీ వేసుకుంటుంటే మీ మైండ్ కరాబ్ అవుతుంది..ఇలాంటి లెక్కలతో సంబంధం లేకుండా, చురుగ్గా నడవడంపై దృష్టి పెట్టడం మంచిది.

ఇలా మీరు రోజుకు ఎన్ని అడుగులు నడవగలుగుతున్నారో ఓ సారి చెక్ చేసుకోండి. జాబ్ చేసే వాళ్లకు డైలీ నడవటం అంటే కాస్త కష్టమైన పనే.. తికిమక షిఫ్ట్ ల వల్ల జిమ్ కు వెళ్లటం కూడా సాధ్యపడతు. కాబట్టి టైం ఉన్నప్పుడు నడిచేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడేప్పుడు అలా సోఫాలో పడుకోకుండా నడుస్తూ మాట్లాడితే..టైం కూడా తెలియదు.!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news