కరోనా కారణంగా ప్రస్తుతం ప్రతిఒక్కరికీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే అవగాహన పెరిగింది. ఈ మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. రోగనిరోధక శక్తి పెంచుకుంటున్నారు. అయితే కొన్ని అలవాట్ల ద్వారా ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.
అధికంగా మద్యం సేవించడం వల్ల..
నిత్యం మద్యం సేవించే వారికి కాలేయ సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల ఇమ్యూనిటీ తగ్గి.. మొదట న్యూమోనియా, ఆ తర్వాత శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. వీలైనంత వరకు మద్యం సేవించడం తగ్గించుకోవాలంటున్నారు.
ఉప్పుతో ముప్పు..
రుచికి సరిపడా ఉప్పు లేదని కొందరు ఆహారంలో ఉప్పు అధికంగా వాడేస్తుంటారు. దీంతో రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని.. తద్వారా రోగనిరోధక శక్తి బలహీన పడుతుందని ఇటీవలే ఓ అధ్యాయనంలో తేలింది. అధిక ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలో సోడియంను మూత్రపిండాలు వడపోసే సమయంలో డొమినే ఎఫెక్ట్ ఏర్పడుతుంది. దీని వల్ల శరీరం బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుందని, ఇమ్యూనిటీ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
చక్కెరతో వచ్చే చిక్కు…
స్వీట్ ని ఇష్టపడని వారుండరూ. రోజూ వారి జీవితంలో ఏదో ఒక సందర్భానా తీపి పదార్థాలను తినేస్తుంటారు. మోతాదుకు మించి చక్కెరను తీసుకోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. శరీరంలో చక్కెర స్థాయి పెరిగితే రోగనిరోధక కణాల పని సామర్థ్యం కూడా తగ్గిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కాఫీ, టీకి దూరంగా ఉండండి..
కాఫీ, టీలో కెఫిన్ ఉంటుందని అందరికీ తెలిసిందే. కెఫిన్ మెదడు ఉత్తేజం చేయడానికి ఉపయోగపడుతుంది. నిద్ర రాకుండా ఉండేందుకు టీలు తాగేస్తుంటారు. అయితే టైం కాని టైంలో కాఫీ, టీలు సేవించడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. ఫలితంగా కడుపులో మంట, రోగనిరోధక శక్తి తగ్గడం జరుగుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.