కరోనా లాక్‌డౌన్ వల్ల గత 40 రోజుల నుంచీ మనం ఇండ్లలోనే ఉంటున్నాం. కేవలం కుటుంబ సభ్యులతో తప్ప ఇతరులతో మాట్లాడడం లేదు. బంధువులు, స్నేహితులకు ఫోన్ లేదా వీడియో కాల్స్ చేసినా.. వారు మన దగ్గర లేరన్న బాధ మనకు కలుగుతోంది. ఇక ఉద్యోగులకు అయితే తమ జాబ్ పోతుందేమోనన్న భయం.. నెల తిరిగే సరికి జీతం ఎలా..? ఈఎంఐలు, బిల్లు చెల్లింపులు ఎలా చేయాలన్న బెంగ కలుగుతోంది. మరోవైపు కరోనా మహమ్మారి మనకు సోకితే ఎలా..? ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఉంటే.. వారు కరోనా బారిన పడే వారిని ఎలా కాపాడుకోవాలి..? అన్న భయం చాలా మందికి కలుగుతోంది. ఇలాంటి ఎన్నో భయాలు, ఆందోళనల నడుమ సగటు జీవి నిత్యం తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే.. లాక్‌డౌన్ వల్ల మనకు ఎదురవుతున్న ఒత్తిడి నుంచి చాలా సులభంగా బయట పడవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
* కరోనా బారిన పడకుండా మనం ఇండ్లలోనే క్వారంటైన్‌లో ఉంటున్నాం.. కనుక భయపడాల్సిన పనిలేదు. అందరికీ ధైర్యం చెప్పాలి. ఒక వేళ వైరస్ వచ్చినా.. వేగంగా స్పందించాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి. నేడు ఎమర్జెనీలో ఉన్న కరోనా పేషెంట్లను కూడా బతికిస్తున్నారు. కనుక కరోనా వస్తుందనో, వచ్చాక ఎలా.. అనో ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎవరికి వారు ధైర్యం చెప్పుకోవాలి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
* ఇండ్లలో ఉండే చిన్నారులు, వృద్ధులను ఎట్టిపరిస్థితిలోనూ బయటకు వెళ్లనీయకూడదు. బయటి నుంచి వచ్చే వారు శానిటైజ్ అయ్యాకే ఇండ్లలోకి వెళ్లాలి. దీంతో కరోనా చైన్ బ్రేక్ అవుతుంది. ఈ క్రమంలో కరోనా సోకుతుందేమోనన్న భయం నుంచి బయట పడవచ్చు. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.
* నిత్యం 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలి. నిద్ర ఎంత ఎక్కువ పోతే.. అంత ఎక్కువగా ఒత్తిడి తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన జీవనవిధానానికి మొదటి మెట్టు నిద్ర. కనుక నిత్యం ఎవరైనా సరే.. 8 గంటల పాటు నిద్రించాలి. లాక్‌డౌన్ వల్ల ఎలాగూ ఇండ్లలోనే ఉంటున్నాం కనుక.. ఎవరైనా సులభంగా నిత్యం 8 గంటల పాటు నిద్రించవచ్చు. అది ఎలాగూ ఇబ్బంది కాదు.
* యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు.
* చాలా తక్కువ సౌండ్‌తో మీకు ఇష్టమైన సంగీతం విన్నా.. పుస్తకాలు చదివినా.. పచ్చని ప్రకృతిలో కాసేపు గడిపినా.. లేదా ఇండ్లలో చిన్న పిల్లలతో కాసేపు ఆడుకున్నా.. ఒత్తిడి క్షణాల్లోనే మటుమాయం అవుతుంది.
* వంట చేయడం, మొక్కలకు నీళ్లు పెట్టడం, కూరగాయలు కట్ చేయడం.. వంటి పనులు చేసినా.. ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు.
* స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్, జాగింగ్, వాకింగ్ వంటివి చేసినా ఒత్తిడి తగ్గుతుంది.
* ఒత్తిడిని తగ్గించుకోవాలంటే.. వీలైనంత వరకు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్‌ను మానేయాలి. అన్ని పోషకాలు కలిగిన పౌష్టికాహారాన్ని నిత్యం తీసుకోవాలి. దీంతో ఆందోళన, మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి.