ఆరోగ్యంగా ఉండాలని చాలామంది రోజు వ్యాయామం చేస్తారు. ఇది మంచి అలవాటే. ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. కానీ మీరు ఈ శారీరక కార్యకలాపాలను మితంగా చేయాలి. ఎక్కువ వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి, శ్రేయస్సుకు ప్రమాదకరం. నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చేయాలి. వ్యాయామం లాభాలు, నష్టాలను తెలుసుకోవాలి. అయితే అధిక వ్యాయామం మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేస్తుంది. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకోండి.
మీరు జిమ్‌కి వెళ్లినప్పుడు, సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీలు చేసినప్పుడు మీ పనితీరు మందగించడం, చెమటలు పట్టడం, దడ రావడం సహజం. ఇది మీ శరీరం విశ్రాంతి కోరుకుంటుంది అనే దానికి సంకేతం. మీ సహనం, సామర్థ్యానికి మించి వ్యాయామం చేయవద్దు.
మితమైన వ్యాయామం మీకు రిలాక్స్‌గా, మంచి రాత్రి నిద్రను అందించడంలో సహాయపడుతుంది. సుదీర్ఘమైన వ్యాయామం మీ ఒత్తిడి హార్మోన్‌లైన కార్టిసాల్, అడ్రినలిన్‌లను ప్రేరేపిస్తుంది. అటువంటి హార్మోన్ల ప్రేరణ నిద్రలేని రాత్రులకు కారణమవుతుంది. అధిక వ్యాయామం చేసి.. విశ్రాంతి తీసుకోకపోతే నొప్పులు వస్తాయి. మీ కండరాలు కోలుకోవడానికి తగినంత సమయం ఉండదు. ఇది మీ రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది.
అధిక వ్యాయామం మీ రుతుక్రమ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆలస్యం కావడానికి దారితీస్తుంది. దీనిని అమెనోరియా లేదా వ్యాయామం-ప్రేరిత అనోరెక్సియా అంటారు. తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. అమెనోరియా మీ జీవక్రియ రేటును తగ్గిస్తుంది. ఇది మీ శరీరం అండోత్సర్గము, శక్తిని వినియోగించకుండా నిరోధిస్తుంది.
వ్యాయామం తర్వాత మీ మూత్రంలో రంగు మార్పులను మీరు గమనించినట్లయితే ఇది రాబ్డోమియోలిసిస్ అనే పరిస్థితిని సూచిస్తుంది. దెబ్బతిన్న కండరాల కణజాలం నుంచి పదార్థాలు రక్తంలోకి లీక్ అవుతాయి. దీనివల్ల కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మితిమీరి వ్యాయామం చేయకూడదు.
గుండె జబ్బులు ఉన్నవారు ఎక్కువ వ్యాయామం చేస్తే గుండెపోటు, స్ట్రోక్‌తో మరణించే ప్రమాదం అధికంగా ఉంది. వారానికి ఐదు సార్లు కంటే ఎక్కువ వ్యాయామం చేసే వ్యక్తులు వయస్సు పెరిగేకొద్దీ గుండె లయలు క్రమరహితంగా మారుతాయని ఓ అధ్యయనం చెబుతుంది.