మధుమేహం(షుగర్) అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. వాస్తవానికి ఏటా 10 లక్షల మందిని ఈ వ్యాధి బలితీసుకుంటోంది. మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కర స్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థాయిలో ఉండడం. అయితే జర్మనీ అధ్యయనం ప్రకారం పొడవుగా ఉండేవారితో పోలిస్తే పొట్టిగా ఉండేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ అయ్యాయని తెలుస్తోంది. ఎత్తు తగ్గుదలలో ప్రతి 4 అంగుళాలకు మధుమేహం ముప్పు మగవారికైతే 41%, ఆడవారికైతే 33%మేరకూ పెరుగుతూ ఉన్నట్లు పరిశోధకులు గమనించారు.
హైట్ తక్కువగా ఉండే వారి కాలేయంలో కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉండటం, గుండె జబ్బులు, ఇతరత్రా జీవక్రియ సంబంధ జబ్బులకు దారితీసే అధిక రక్తపోటు, కొలస్ట్రాల్, వాపు ప్రక్రియలు సైతం ఎక్కువగానే ఉంటుండటం గమనార్హం. ఇవన్నీ మధుమేహాన్ని తెచ్చిపెట్టేవే. అందుకే కాలేయ కొవ్వును తగ్గించే పద్ధతులతో మధుమేహం ముప్పును తగ్గించుకునే అవకాశం లేకపోలేదని పరిశోధకులు సూచిస్తున్నారు.