మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. సూర్యరశ్మిలో నిత్యం కొంత సేపు గడపడం ద్వారా మనకు ఈ విటమిన్ లభిస్తుంది. అలాగే పలు ఆహారాల ద్వారా కూడా మనకు ఈ విటమిన్ అందుతుంది. దీని వల్ల మన శరీరగ రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ఎముకలు దృఢంగా ఉంటాయి. అయితే విటమిన్ డి మన శరీరానికి అవసరమే. కానీ దీన్ని పరిమితికి మించి తీసుకుంటే మాత్రం అనర్థాలు సంభవిస్తాయి.
విటమిన్ డి ఎక్కువైతే మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి. కండరాలు బలహీనంగా మారినట్లు అనిపిస్తాయి. ఎముకల్లో నొప్పి కలుగుతుంది. పెళుసుగా మారి విరిగిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. కొందరిలో వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో వాంతులు కూడా అవుతాయి. కనుక ఎవరైనా సరే విటమిన్ డిని మోతాదులోనే తీసుకోవాలి. అధికమైతే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.
విటమిన్ డి మనకు చేపలు, రొయ్యలు, పుట్టగొడుగులు, పాలు, చీజ్ వంటి అనేక పదార్థాల్లో లభిస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకుంటున్నారు. అలాగే విటమిన్ డి ట్యాబ్లెట్లను కూడా వాడుతున్నారు. కానీ మోతాదులో మాత్రమే ఈ విటమిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ డి నిత్యం ఎవరెవరికి ఎంత మోతాదులో కావాలంటే…
* 0 నుంచి 6 నెలల వయస్సు ఉన్న పసికందులకు 400ఐయూ
* 7 నుంచి 12 నెలల వయస్సు ఉన్న వారికి 400ఐయూ
* 1 నుంచి 3 ఏళ్ల వయస్సు వారికి 600ఐయూ
* 4 నుంచి 8 ఏళ్ల వారికి 600ఐయూ
* 9 నుంచి 70 ఏళ్ల వారికి 600ఐయూ
* 70 ఏళ్లు పైబడిన వారికి 800ఐయూ
* గర్భంతో ఉన్నవారు, పాలిచ్చే తల్లులకు 600 ఐయూ