వయస్సు మీద పడిన కొద్దీ మనకు వచ్చే అనారోగ్య సమస్యల్లో ఆస్టియోపోరోసిస్ కూడా ఒకటి. ఎముకలు రాను రాను గుల్లగా మారి పోయి బలహీనమైపోతాయి. దీంతో చిన్న దెబ్బ తగిలినా అవి విరుగుతాయి. దీన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఆరంభంలో ఈ వ్యాధి ఉంటే గుర్తించడం కష్టమే. ఎముకలు విరిగినప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు పరీక్షలు చేస్తే తెలుస్తుంది. అయితే మనం నిత్య జీవితంలో తీసుకునే పలు ఆహార పదార్థాలు కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చేందుకు కారణాలు అవుతుంటాయి. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటంటే…
1. కోలా వంటి శీతలపానీయాలు ఎక్కువగా తాగేవారికి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. వాటిల్లో ఉండే పాస్ఫారిక్ యాసిడ్ ఎముకలను గుల్లగా మారుస్తుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారి క్రమంగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది.
2. చక్కెర, రీఫైన్డ్ కార్బొహైడ్రేట్లను ఎక్కువగా తినేవారికి కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. చిప్స్, బ్రెడ్, వైట్ రైస్, కార్న్ లలో రీఫైన్ చేయబడిన పదార్థాలను తింటే ఎముకలు బలహీనమవుతాయి. తద్వారా వయస్సు మీద పడ్డాక ఆస్టియోపోరోసిస్ వస్తుంది.
3. గ్రిల్ చేయబడి, కాల్చబడిన పదార్థాలను కూడా తినరాదు. వాటి వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
4. ఉప్పు ఎక్కువగా తిన్నా ఆస్టియోపోరోసిస్ త్వరగా వస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
5. క్రిమి సంహారకాలు బాగా ఉపయోగించి పండించిన పండ్లు, కూరగాయలను తింటున్నా లేదా.. విపరీతంగా మద్యం సేవిస్తున్నా.. ఆస్టియోపోరోసిస్ త్వరగా వస్తుంది.